Sunday, October 13, 2024

TG రెండేళ్ల‌లో శ్రీశైలం సొరంగ ప‌నులు పూర్తి చేస్తాం – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

స్మార్ట్ న్యూస్, నల్లగొండ : 2027, సెప్టెంబర్ 20 వరకు శ్రీశైలం సొరంగం పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. శుక్రవారం మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లు ఎస్ ఎల్ బి సి టన్నెల్ పనులను పరిశీలించారు. టన్నెల్ అవుట్ లెట్ ప్రాంతానికి చేరుకున్న ఆయన ప్రత్యేక ట్రైన్ లో సొరంగం లోపలికి వెళ్లి పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు సమీపంలోనే ఇరిగేషన్, అటవీ, విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కొద్దిపాటి ఖర్చుతో సంవత్సరం అంతా రూపాయి ఖర్చు లేకుండా సాగునీరు అందించే ఎస్ఎల్బీ సీ టన్నెల్ పనులను పూర్తి చేయడంలో బీ ఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు.

రాష్ట్ర విభజన కంటే ముందే ఎస్ ఎల్ బి సిసొరంగం 31 కిలోమీటర్లు పూర్తి అయిందని మిగిలిన 12 కిలోమీటర్ల సొరంగాన్ని త‌వ్వి నాలుగు లక్షల ఎకరాలకు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించేందుకు అప్పటి ప్రభుత్వం కేవలం 1000 నుండి 1500 కోట్లు మంజూరు చేస్తే ఈ ప్రాజెక్టు పూర్తయిదని అన్నారు. ప్రజలకు ఎంతో ఉపయోగమైన ఈ ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేయకుండా మేడిగడ్డ ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేస్తే తెలంగాణలో ఇప్పటికే లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చేదని భట్టి విక్రమార్క అన్నారు.

- Advertisement -

పురోగతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయక, అవసరం లేని ప్రాజెక్టులను నిర్మించి రాష్ట్రంలో బీ ఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పై మోపిందని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఎస్ఎల్బిసి టన్నెల్ పనులను సందర్శించిన తాను ఇందిరమ్మ రాజ్యం వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన సొరంగం పనులను పూర్తి చేసి బీడు భూములకు సాగునీరు అందిస్తానని చెప్పానని హామీ ఇచ్చిన విధంగానే ఈరోజు ప్రాజెక్టు పనులపై సమీక్ష చేశారని చెప్పారు.

సొరంగాన్ని తొలిచే టీబీఎం మిషన్ బేరింగ్ చెడిపోవడంతో పనులు నిలిచిపోయాయని అధికారంలోకి వచ్చిన వెంటనే బేరింగ్ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అమెరికాకు పంపించామని చెప్పారు. బేరింగ్ కోసం 42 కోట్ల రూపాయలను మంజూరు చేశామని అతి కొద్ది రోజుల్లో బేరింగ్ రానుందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. టన్నేల్ పనులతో పాటు డిండి రిజర్వాయర్, నక్కల గండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను కూడా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆయా ప్రాజెక్టుల కింద భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ భూముల సేకరణ తదితర అంశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సముద్ర ప్రభుత్వం చూస్తుందని చెప్పారు.

రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ప్రాజెక్టులు పూర్తి కోసం ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సొరంగం రెండు వైపులా తొలిచే పనులు ప్రారంభమైతే రోజుకు 400 మీటర్ల సొరంగం తొవ్వే పనులు అవుతాయని ఇందుకోసం నెలకు 30 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కాంటాక్ట్ పనులను దక్కించుకున్న సంస్థ చెప్పిందని ఆయన తెలిపారు. వారు చెప్పిన విధంగానే నెలకు 30 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నల్లగొండ ,నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు సి నారాయణరెడ్డి, సంతోష్, నీటిపారుదల సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement