Friday, October 4, 2024

TG కుటుంబ డిజిట్ కార్డులో.. మ‌హిళే య‌జ‌మాని – రేవంత్

హైద‌రాబాద్‌: కుటుంబ డిజిట‌ల్ కార్డులో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని, ఇత‌ర కుటుంబ స‌భ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌కు (ఎఫ్‌డీసీ) సంబంధించి రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌పై ఈ నెల 25వ తేదీ నుంచి 27 వ తేదీ వ‌ర‌కు రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల్లో ప‌ర్య‌టించిన అధికారులు చేసిన అధ్య‌య‌నంపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. కార్డుల రూపకల్పలో ఆయా రాష్ట్రాలు సేక‌రించిన వివ‌రాలు, కార్డుల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలు, లోపాల‌ను అధికారులు వివ‌రించారు.

అనంత‌రం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ రూపకల్పనపై అధికారుల‌కు ప‌లు ఆదేశాలు, సూచ‌న‌లు ఇచ్చారు. ప్ర‌స్తుతం ఉన్న రేష‌న్, రాజీవ్ ఆరోగ్య‌శ్రీ‌, ఐటీ, వ్య‌వ‌సాయ‌, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల్లోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధార‌ణ చేయాల‌ని సూచించారు. ఇత‌ర రాష్ట్రాల కార్డుల రూప‌క‌ల్ప‌న‌, జారీలో ఉన్న మేలైన అంశాల‌ను స్వీక‌రించాల‌ని, లోపాల‌ను ప‌రిహారించాల‌న్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అన‌వ‌స‌ర స‌మాచారం సేక‌రించాల్సిన ప‌ని లేద‌న్నారు.

- Advertisement -

ప్ర‌తి శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో పైలెట్‌గా రెండు ప్రాంతాల్లో…ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌కు స‌మ‌చార సేక‌ర‌ణ‌, వాటిల్లో ఏం ఏం పొందుప‌ర్చాలి, అప్‌డేట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా మంత్రులు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌ల‌తో కూడిన మంత్రివ‌ర్గ ఉప సంఘానికి అంద‌జేయాల‌ని ముఖ్య‌మంత్రి అధికారులను ఆదేశించారు.

మంత్రివ‌ర్గ ఉప సంఘం సూచ‌న‌ల మేర‌కు అందులో జ‌త చేయాల్సిన‌, తొల‌గించాల్సిన అంశాల‌ను స‌మ‌గ్ర జాబితా రూపొందించాల‌ని సూచించారు. అనంత‌రం రాష్ట్రంలోని 119 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు ప్రాంతాలు ఒక గ్రామీణ‌, ఒక ప‌ట్ట‌ణ ప్రాంతాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాల‌ని సీఎం సూచించారు.

(పూర్తిగా గ్రామీణ ప్రాంతాలున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు గ్రామాలు, పూర్తిగా ప‌ట్ట‌ణ‌/న‌గ‌ర ప్రాంతాలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు వార్డులు/ డివిజ‌న్లను ఎంపిక చేస్తారు.) కుటుంబాల నిర్ధ‌ర‌ణ‌, ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల వివ‌రాల‌కు సంబంధించి అందుబాటులో ఉన్న డాటా ఆధారంగా అక్టోబ‌రు మూడో తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి (డోర్ టూ డోర్‌) ప‌రిశీల‌న చేయించాల‌ని రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు.

పైలెట్ ప్రాజెక్టును ప‌క‌డ్బందీగా చేపట్టాల‌ని, ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ఆర్డీవో స్థాయి అధికారిని, ప‌ట్ట‌ణ‌/న‌గ‌ర ప్రాంతాల్లో జోన‌ల్ క‌మిష‌న‌ర్ స్థాయి అధికారిని ప‌ర్య‌వేక్ష‌ణ‌కు నియ‌మించాల‌ని, ప్ర‌తి ఉమ్మ‌డి జిల్లాకు ఇటీవ‌ల వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వేసిన సీనియ‌ర్ అధికారుల‌ను ప‌ర్య‌వేక్ష‌కులుగా నియ‌మించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని రేవంత్ ఆదేశించారు.

క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న స‌మ‌గ్రంగా క‌చ్చిత‌త్వంతో చేప‌ట్టాల‌ని, ఎటువంటి లోపాల‌కు తావులేకుండా చూడాల‌ని ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించారు

. స‌మీక్ష‌లో మంత్రులు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శులు అజిత్ రెడ్డి, చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శులు సంగీత స‌త్యానారాయ‌ణ‌, మాణిక్ రాజ్‌, షాన‌వాజ్ ఖాసీం, ముఖ్య‌మంత్రి ఓఎస్డీ వేముల శ్రీ‌నివాస్‌, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement