Friday, October 4, 2024

TG – నీలి విప్లవానికీ తూట్లేనా రేవంత్ – కేటీఆర్

హైదరాబాద్ -;మత్స్యకారుల అభివృద్ధికి గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఉచిత చేప పిల్లల పంపిణీ ప‌థ‌కాన్ని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన తర్వాత మత్స్యకారుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. మత్తడి దుంకే చెరువుల్లో మత్స్య సంపద సృష్టించిన నిన్నటి నీలి విప్లవాన్ని నీరుగార్చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

వృత్తి కులాలపై కత్తి కట్టినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. చేప పిల్లల పంపిణీ పథకాన్ని చెడగొట్టడానికే కాంగ్రెస్ సర్కారు ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపిస్తున్నద‌న్నారు. ఇప్పటిదాకా చేప పిల్లల పంపిణీ మొదలు కాలేదు.. టెండర్ల దశ దాటనే లేదు.. అసలు ఆ ప‌థ‌కం ఉంటుందో లేదో ఎవరికీ తెలియని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని కేటీఆర్ అన్నారు.చేపల వేటనే నమ్ముకున్న బహుజన కులాల బతుకు దెరువును దెబ్బకొట్టడం న్యాయమా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ సూటిగా ప్ర‌శ్నించారు.

ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం.. వృత్తికి ఊపిరిపోసి మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది.. ఇన్ లాండ్ ఫిష్ ఉత్పత్తిలో తెలంగాణ అద్భుతాలు చేసింది..! కేసీఆర్ ఆనవాళ్లను తుడిచెయ్యాలనే రాజకీయ కక్షతో..మత్స్యకారుల జీవనోపాధిని కాలరాస్తారా..? అని కాంగ్రెస్ స‌ర్కార్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు

Advertisement

తాజా వార్తలు

Advertisement