Saturday, December 7, 2024

TG – మీ భ‌జ‌న‌కు మేం చిడ‌త‌లు వాయించాలా – రేవంత్ ను ప్రశ్నించిన హరీశ్ రావు

మీరు అన్యాయం చేస్తుంటే వంత పాడాలా
భూములు ఇవ్వ‌బోమ‌ని రైతులు అంటుంటే….
మొండిగా వ్య‌వ‌రిస్తున్న‌ది మీరే
ఏక్క‌డ ఆందోళ‌న జ‌రుగుతున్నా మా పార్టీ కుట్రేనా
ల‌గ‌చ‌ర్ల దాడితో మా నేత‌కు, పార్టీకి ఏం సంబంధం
రేవంత్ పాల‌న అంతానికి ఇక కౌంట్ డౌన్ ప్రారంభం
చ‌ర్ల‌ప‌ల్లి జైలు వ‌ద్ద మీడియాతో హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందని ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్టై నిన్న చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలులో నేడు ములాఖ‌త్ స‌మ‌యంలో హ‌రీశ్ బృందం భేటి అయ్యింది.. పార్టీ అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని, ధైర్యంగా ఉండాల‌ని ప‌ట్నంకు భరోసా ఇచ్చారు.

- Advertisement -

అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, మీరు చేసే అక్రమాలకు చిడతలు వాయించాల్న అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్ పగ ప్రతీకారంతో పట్నంను కుట్రపూరితంగా నరేందర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయించారని ఆరోపించారు. కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైందని.. ఈ అరెస్ట్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మీకు ఓటేస్తే మేలు జరుగుతుందనుకుంటే పాపానికి.. లగచర్ల గ్రామం భూములను గుంజుకోవడమే మీరు చేసే మేలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు.

ఎక్కడ ఏం జరిగినా బీఆర్‌ఎస్‌పై పెడుతున్నారన్నారు. నిరుద్యోగులు, రైతులు, పోలీసులు స్వచ్ఛందంగా ధర్నా చేస్తే అది బీఆర్‌ఎస్‌ చేయించిందని రేవంత్ అంటున్నారని.. రేవంత్ సొంత నియోజకవర్గంలో తమ భూముల కోసం గిరిజనులు పోరాటం చేస్తే అది కూడా బీఆర్‌ఎస్‌ చేసిందనే అంటున్నారన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడడం ప్రతిపక్షాలుగా మా బాధ్యత అన్నారు. మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టాలనుకుంటున్నావేమో .. మాపై కోపం ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి‌.. కానీ అమాయక గిరిజన రైతులపై కేసులెలా పెడతారని సీఎంని ప్రశ్నించారు. వెంటనే గిరిజన రైతులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా ..? ప్రజాస్వామ్యమెక్కడుంది అంటూ నిలదీశారు.

మల్లన్నసాగర్‌లో రేవంత్‌ రెండురోజులు నిరసన చేస్తే మేం అడ్డుకున్నమా.. ? అని ప్రశ్నించారు. అర్ధరాత్రి మహిళల చాతిమీద కాళ్లు పెట్టి అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఈ ప్రజల తిరుగుబాటు ఆగదని.. రేవంత్‌ని గద్దె దించే దాకా నిద్రపోమన్నారు. త‌మ‌ ప్రభుత్వంలో 14వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించామని.. అక్కడెందుకు ఫార్మాసిటీ కట్టరని ప్రశ్నించారు. ఇందిరమ్మ ముసుగులో దళితుల, గిరిజనుల భూములు గుంజుకుంటున్నారని.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన ఇప్పుడు కనిపిస్తోందన్నారు. రైతుల భూములు గుంజుకోవడమే ఇందిరమ్మ పాలన అని నిలదీశారు. రేవంత్‌ పాలన అదానీ, తమ్ముళ్లు, అల్లుళ్ల కోసమేనని తేల్చి చెప్పారు.. రైతుల భూముల‌ను కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ దళిత, గిరిజనుల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు.

ఇక నరేందర్ రెడ్డికి ఈ కేసుతో ఏ సంబంధం లేదన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందో తెలియదని.. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడానికి ఒక్క నిముషం ముందు ఒత్తిడి చేసి నరేందర్‌రెడ్డితో సంతకం చేయించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి బడాబాబులపై ప్రేమ ఉందన్నారు. నరేందర్‌రెడ్డి ధైర్యంగా ఉన్నారని.. ఆయనకు బీఆర్‌ఎస్‌ అండగా నిలుస్తుందన్నారు. ధర్మమే గెలుస్తుందని.. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందన్నారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత కొడంగల్ నుండే ప్రారంభమయ్యిందన్నారు. ఉద్యమాలు, కేసులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు. అన్యాయంగా పేద ప్రజల భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. అక్రమంగా నరేందర్ రెడ్డిని అరెస్టు చేసినా, అక్రమ కేసులు పెట్టినా ప్రజల తిరుగుబాటు కొడంగల్ నుండే ప్రారంభమయ్యింది అన్నారు. కాగా హ‌రీశ్ రావు వెంట‌నే ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి , ఇత‌ర నేత‌లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement