Monday, December 2, 2024

TG – మాజీ స‌ర్పంచ్ ల విడుద‌ల కోరుతూ హ‌రీశ్ రావు ధ‌ర్నా

చ‌లో అసెంబ్లీకి వెళ్ల‌కుండా రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్పంచ్ ల అరెస్ట్
ఈ అరెస్ట్ ల‌ను ఖండించిన‌ హ‌రీశ్ రావు
తిరుమ‌ల‌గిరి పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద బిఆర్ఎస్ నేత‌ల ధ‌ర్నా
బకాయిలు అడిగితే ఆరెస్ట్ చేస్తారా అంటూ ప్ర‌శ్న

హైద‌రాబాద్ – పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ నేడు ఛలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు మాజీ సర్పంచ్ లు. అయితే హైదరాబాద్ కు వెళ్లకుండా మాజీ సర్పంచ్ లను ముందస్తుగానే ఆయా జిల్లాల‌లోనే అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ అరెస్ట్ ల‌ను హ‌రీశ్ రావు ఖండించారు. అరెస్ట్ అయిన‌వారిని వెంట‌నే విడుద‌ల చేయాలని కోరుతూ తిరుమలగిరి పీఎస్ ముందు రోడ్డుపైన హరీశ్ రావుతో పాటు మండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, , వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ సంజయ్ తోపాటు పలువురు నిరసనకు దిగారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా హ‌రీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్‌ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్‌కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు.

అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్టులు చేయడమేనా అని నిలదీశారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, చిన్న పనులు చేసిన మాజీ సర్పంచులకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నారు. అక్రమంగా నిర్బంధించిన, అరెస్టులు చేసిన మాజీ సర్పంచులను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని బీఆర్‌ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement