Tuesday, November 12, 2024

TG : కేటీఆర్‌కు చేదు అనుభవం..!


మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం హైదరాబాద్‌లోని మౌలాలిలో ప్రొఫెసర్ సాయిబాబా పార్థీవ దేహానికి కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు. ఈ నేపథ్యంలోనే సాయిబాబా భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు.

పదేళ్లు సాయిబాబా జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది.. నేడు నివాళి అర్పించడానికి ఎలా వస్తారంటూ నిరసన తెలిపారు. దీంతో వెంటనే కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే నినాదాలు చేసింది.. పౌర హక్కుల నేతలు కాదని, మైనంపల్లి హన్మంతరావు వర్గీయులు గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, కేటీఆర్ ప్రొఫెసర్ సాయిబాబా నివాళులు అర్పించిన విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ సాయిబాబా ఉపా చట్టం కింద అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు. అతను 90% వైకల్యం కలిగి ఉన్నప్పటికీ, ఆరోగ్య కారణాలు ఉన్నా బెయిల్ నిరాకరించారని, కనీసం అతని తల్లి అంత్యక్రియలకు హాజరు కావడానికి కూడా పెరోల్ కూడా పొందలేకపోయారని తెలిపారు. దాదాపు దశాబ్దం పాటు జైలు జీవితం గడిపిన తర్వాత సాయిబాబా ఉపా ఆరోపణల నుంచి విముక్తి పొందారని గుర్తు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement