Tuesday, April 23, 2024

వ్యవసాయం, అటవీ, మత్స్యరంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతి.. ఆర్​బీఐ ప్రశంసలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ, మత్స్యరంగాల్లో గడిచిన అయిదేళ్ల కాలంలో సాధించిన ప్రగతిని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ( ఆర్‌బీఐ ) తన నివేదికలో వెల్లడించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ తెలిపారు. గడిచిన అయిదేళ్లలో కేవలం వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లోనే రూ. 1.81 లక్షల కోట్ల విలువైన సంపదను తెలంగాణ రాష్ట్రం సృష్టించిందని ఆర్‌.బీ.ఐ. పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో తెలంగాణ సాధించిన ఈ ప్రగతి జాతీయ స్థాయిలో రికార్డుగా ఆర్‌.బీ.ఐ. స్పష్టం చేసిందన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ గర్వ కారణమన్నారు. పలు రంగాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం కనబరుస్తున్న చిత్తశుద్ధికి ఆర్‌బీఐ ప్రశంసలే నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్‌ పరిపాలనా దక్షతకు ఆర్‌బీఐ నివేదిక నిలువుటద్దం అని వ్యాఖ్యానించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తెలంగాణ వెనుకబడిందని విమర్శిస్తున్న కబోదులకు ఆర్బీఐ నివేదిక దిమ్మ తిరిగిపోయే సమాధానమిచ్చిందని పేర్కొన్నారు. అయిదే క్రితం రూ. 95 వేల కోట్లు, ప్రస్తుతం రూ. 1.81 లక్షల కోట్ల సంపద సృష్టి వెనక తెలంగాణ ప్రభుత్వ చర్యలే కారణమని హ్యాండ్‌బుక్‌లో ఆర్‌బీఐ వివరించిందన్నారు. 2017-18 లో రూ. 95, 098 కోట్లుగా ఉన్న ఈ మూడు రంగాల ఉత్పత్తుల విలువ 2021-22 నాటికి ఏకంగా రూ.1,81,702 కోట్లకు పెరిగినట్లుగా ఆర్‌.బీ.ఐ వెల్లడించిందని చెప్పారు.

ఇంతటి వృద్ధి మరే రాష్ట్రాల్లోనూ లేదని, తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక చర్యలతోనే ఈ మూడు రంగాల్లో గణనీయ వృద్ధి సాధ్యమైందని ఆర్బీఐ చెప్పిందని తెలిపారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తును అందించేందుకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇప్పటివరకు రూ. 353 కోట్లు ఖర్చుచేసి 425 కోట్ల చేప పిల్లల్ని ఉచితంగా పంపిణీ చేసిందని, ఆరేళ్లలో రూ. 26 వేల కోట్ల సంపదను సృష్టించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో అడవుల శాతం భారీగా పెరిగిందని, రాష్ట్రం ఆకు పచ్చగా మారిందన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం 2001 నుంచి 2014 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేసీఆర్‌.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement