Thursday, April 18, 2024

తెలంగాణలో స్కూళ్లు రీ-ఓపెన్.. ప్రభుత్వం నిర్ణయమేంటి?

తెలంగాణలో విద్యాసంస్థలు తెరిచేందుకు కసరత్తు జరుగుతోంది. సెప్టెంబరు 1 నుంచి పునః ప్రారంభించేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. తొలుత 8 నుంచి ఆపై తరగతులకు ప్రత్యక్ష బోధన మొదలుపెట్టాలని యోచిస్తున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు.. సెప్టెంబరు నెలాఖరులో మొదటి సంవత్సరం పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు.

కరోనా ప్రభావంతో గత మార్చిలో విద్యా సంస్థలు మూత పడ్డాయి. మధ్యలో తొమ్మిది ఆపై తరగతులు పాక్షికంగా ప్రారంభించగా.. సెకండ్ వేవ్ తీవ్రత పెరగడంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో ఆన్​లైన్ బోధనకే పరిమితం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో వైరస్ ఉదృతి తగ్గింది. కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉందని.. ఆగస్ట్ లోనే మూడో దశ ప్రారంభం కానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజు 500 నుంచి 600 లోపే కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలు పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గత నెల 1 నుంచే అన్ని తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గింది. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాలు ఈ నెలలోనే విద్యా సంస్థలు తెరుస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ కూడా విద్యా సంస్థలు పున: ప్రారంభానికి సిద్ధమవుతోంది. సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 8 నుంచి ఆపై తరగతులు ప్రారంభించాలని విద్యా శాఖ ప్రతిపాదించింది. వినాయక చవితి ఉత్సవాలు పూర్తయ్యాక సెప్టెంబరు మూడో వారంలో ప్రారంభించాలని మరో ప్రతిపాదన కూడా ఉంది. ప్రతిపాదనలను ఉన్నతాధికారులు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సమర్పించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్​తో మంత్రి సబితా చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ అంగీకరిస్తే విద్యా సంస్థలు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై స్పష్టత రానుంది. ప్రభుత్వ నిర్ణయం అనంతరం విద్యా సంస్థలు తెరిచే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాజమాన్యాలు, తల్లిదండ్రుల సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: పంద్రాగస్టు వేడుకలు.. తెలంగాణలో పతాకావిష్కర్తలు వీరే..!

Advertisement

తాజా వార్తలు

Advertisement