Monday, December 9, 2024

కోకాపేట భూముల అమ్మకాలపై సీబీఐకి రేవంత్ ఫిర్యాదు

హైదరాబాద్ శివారులోని కోకాపేట్‌, ఖానామెట్‌ భూముల అమ్మకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ను కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్ర ఖజానాకు రూ. వెయ్యి నుంచి 1,500 కోట్ల నష్టం జరిగిందని రేవంత్​ ఆరోపించారు. అవినీతి సంపదతో ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. కోకాపేట్​, ఖానామెట్​ భూముల టెండర్లలో గోల్​మాల్​ జరిగిందన్నారు. దీనికి సహకరించిన అందరిపైన రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి అనేది నిజం కాకపోతే భూముల అమ్మకాలపై సీబీఐ చేత విచారణ జరిపించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రేవంత్ సూచించారు.

కాగా, తెలంగాణ ప్రధాన కార్యదర్శి, సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (IT) జయేశ్ రంజన్, HMDA కమిషనర్ అరవింద్ కుమార్ పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇది ఇలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం హెచ్‌ఎండీఏ కోకాపేట భూములు వేలం వేయగా.. అధికారుల అంచనాలకు మించి స్పందన వచ్చింది. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ ద్వారా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) వేలం నిర్వహించింది. ఒక్కో ఎకరం కనీస ధర రూ.25 కోట్లుగా నిర్ధారించగా.. వేలంలో రూ.60 కోట్లు పలికింది. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా రూ.2000.37 కోట్ల ఆదాయం లభించింది. అయితే, ఈ భూముల వేలం వెనుక వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఒక్క ఇల్లు కట్టని ఈటల.. అభివృద్ది చేస్తాడా?: హరీష్

Advertisement

తాజా వార్తలు

Advertisement