Thursday, March 28, 2024

పీడీఎస్ రైస్ డంప్ పై టాస్క్ ఫోర్స్ దాడి – 200 క్వింటాళ్ల రేష‌న్ రైస్ స్వాధీనం

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : వరంగల్ నగర శివారులో పీడీఎస్ రైస్ డంప్ ను ఏర్పాటు చేసి, అక్రమంగా నిల్వ చేసిన డంప్ పై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి, రెండు వందల క్వింటాళ్ళ రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రగుట్ట ప్రాంతంలోని కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ వెనుక భాగంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా రేషన్ రైస్ డంప్ ను ఏర్పాటు చేసి నగరంలోని ప్రాంతాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల నుండి రేషన్ రైస్ ను ప్రజల నుండి నేరుగా కొనుగోళ్ళు చేసి, డంప్ లో అక్రమంగా నిల్వ చేస్తున్నారు. 200 క్వింటాళ్ళ రైస్ మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకొంటున్న రేషన్ రైస్ స్మగ్లర్ బండారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. నగర శివారులో పీడీఎస్ దందా నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు.

టాస్క్ ఫోర్స్ ఏసీపీ వైభవ్ గైక్వాడ్ పర్వవేక్షణలో టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్ట‌ర్ సీహెచ్ శ్రీనివాస్ జీ నేతృత్వంలో దాడి చేశారు. ఈ దాడిలో 200 క్వింటాళ్ళ రేషన్ రైస్, ఒక డీసీఎం వెహికిల్, మరో హోండా యాక్టివాను సీజ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు ఘనపూర్ కు చెందిన రేషన్ రైస్ స్మగ్లర్ చీరాల తిరుపతి(35), కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి కి చెందిన డీసీఎం డ్రైవర్ కడమంచి వెంకటేష్ (35), హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని జంగాల కాలనీకి చెందిన చిత్తరి వెంకట్రాజం(35) లను అరెస్ట్ చేశారు. పీడీఎస్ రైస్ స్మగ్లర్ చీరాల తిరుపతి జైలు నుండి వచ్చిన వారం రోజుల్లోనే మళ్ళీ రేషన్ రైస్ దందా చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. తదుపరి చర్యల కోసం కాకతీయ యూనివర్శిటీ పోలీసులకు అప్పగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement