Friday, March 29, 2024

పోలీసులు కేసీఆర్ గూండాలు.. పింక్ కలర్ బార్బీ డాల్స్: తరుణ్ చుగ్ తీవ్ర వ్యాఖ్యలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై తెలంగాణ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్, కరీంనగర్ పోలీసు కమీషనర్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండించారు. పోలీసులు కేసీఆర్ గూండాలలా వ్యవహరించారని ఆరోపించారు. జాగరణ దీక్షను జలియన్ వాలా బాగ్ లా మార్చారని అన్నారు. ఒక్కో మహిళా కార్యకర్త మీద జరిగిన దాడికి ప్రశాంతంగా దీక్ష చేస్తున్న బండి సంజయ్ ను కోవిడ్ నిబంధనల పేరుతో అరెస్టు చేశారన్నారు.

సీఎం కేసీఆర్ సూచనలతో ఇదంతా జరిగిందన్నారు. మనసులో ద్వేషం, క్రిమినల్ మైండ్ తోనే ఎంపీ కార్యాలయంపై దాడి జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ తీసుకొసామన్నారని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. ద్రౌపది వస్త్రాపహరణంతో మహాభారత యుద్ధం వచ్చిందని, కరీంనగర్ లో కూడా అదేవిధంగా కొందరు పోలీసులు దుర్యోధనుడు దుశ్శాసనునిలా మారి తమ పార్టీ కార్యకర్తలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షకులు భక్షకులుగా మారారని విమర్శించారు. తోలు బొమ్మలలా కేసీఆర్ ఆడించినట్టు కొందరు పోలీసులు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. వీటన్నింటికీ కచ్చితంగా చట్టబద్ధంగా సమాధానం చెప్పి తీరుతామని చెప్పారు. పోలీసులు పింక్ కలర్ బార్బీ డాల్స్ లా మారారని ఆరోపించారు. తాము ప్రజా క్షేత్రంలో ఉండి పోరాడుతుంటే.. కాంగ్రెస్ నేతలు ఏసీ రూంలలో ఉండి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement