Wednesday, October 2, 2024

Swarnagiri | వైభవంగా స్వామి వారి కళ్యాణం..

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం మూలవిరాట్ శ్రీ మదన గోపాలకృష్ణ స్వామివారికి నవకలశాలతో అభిషేకం నిర్వహించారు. స్వామి వారి నిత్యారాధనలో భాగంగా వేదమంత్రోచ్ఛారణలతో, మేళతాళ మృదంగ మంగళ ద్వనుల మధ్య బంగారు బావి నుండి సువర్ణ బిందెతో తీర్ధమును తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని వేయి నామాలతో స్తుతిస్తూ సహస్రనామార్చన సేవను విశేషముగా నిర్వహించారు. శ్రీ సుదర్శన నారసింహ హవనంను చేపట్టారు.

శ్రీవారి వైభవోత్సవ మండపంలో శ్రీ పద్మావతి – గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మనిమయశోభిత స్వర్ణాభరణాలతో,సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు.

నిత్యాన్న ప్రసాద వితరణలో భాగంగా సుమారు 3వేల మందికి పైగా అన్నదానం నిర్వహించారు. మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.

తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సర్వాలంకార భూషితులై దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీపాల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆలయ ధర్మకర్తలు మానేపల్లి రామారావ్, మురళి కృష్ణ, గోపికృష్ణ, పలువురు ప్రముఖులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement