Friday, April 19, 2024

TS | స్టేట్‌ రిక్వెస్ట్‌, సెంట్రల్‌ రిజెక్ట్‌.. అనధికార నిషేధమా?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వివక్ష, అస్తిత్వం, నిధులు, నియామకాలు లాంటి వాటిపై కొట్లాడి సాధించుకున్నారు. గతంలో నిజాం మీద , ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని అసమానతల మీద పోరాటం సాగించారు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలోనూ మరో పోరాటం తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఏ వివక్షపై, ఎలాంటి అన్యాయాలపై, అస్తిత్వంపై కొట్లాడారో మళ్లి అదే అన్యాయానికి గురి కావాల్సి వస్తుందన్న బావన ప్రజల్లో వ్యక్తం అవుతోంది. తెలంగాణ రాష్ట్రానికి వాస్తవంగా దక్కాల్సిన ప్రతి దానిలో కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపిస్తుండటంతో ప్రజానీకం ఆగ్రహానికి గురవ్వుతోంది.

విభజన హామీలను నెరవేర్చలేదు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులను ఇవ్వడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల్లోనూ తిరకాసు పెడుతోందన్న భావన ప్రతి పౌరుణిలో కలిగేలా బీఆర్‌ఎస్‌ చేస్తుండటం.. కేంద్రం తీరు అలాగే ఉండటంతో ప్రజలు ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేసే పరిస్థితి దగ్గర్లోనే ఉందన్న విషయం స్పష్టం అవుతోందని గులాబీ నేతలు తెలుపుతున్నారు.

ప్రతి విషయంలో కిరికిరి
తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఐదేళ్లు కేంద్ర, రాష్ట్రాల మధ్య సక్యత బాగున్నా.. గత రెండేళ్ల నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం.. దాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం పరిపాటిగా మారిపోయింది. రాష్ట్రానికి న్యాయ పరంగా రావాల్సిన ప్రతి దానిలోనూ ఏదో ఒక్క బూచి చూపించి రిజెక్ట్‌ చెస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తున్నారు. ఇక్కడ వాస్తవంగా కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయన్న వాదన సైతం ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి రానున్నామన్న అత్యాశతోనే ఇదంతా కేంద్రంలోని బీజేపీ నేతలు చేస్తున్నారంటూ గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలని, రాష్ట్రానికి ప్రాజెక్టులను నిలిపి వేయాలని, నిధులను విడుదల చేయవద్దని.. ఇలా ప్రతి విషయంలో తెలంగాణపై వివక్షను కేంద్రంలోని బీజేపీ చూపిస్తుందని ప్రతి వేదికల మీద సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం తెలంగాణపై అనధికార నిషేధమా..?
ప్రతి విషయంలోనూ తెలంగాణకు రావాల్సిన వాటిలో కిరికిరి పెట్టడాన్ని బీజేపీ అనధికార నిషేధాన్ని విధించిందా అన్న ప్రశ్నను బీఆర్‌ఎస్‌ నేతలు లేవనెత్తుతున్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో భాగం కాదా అని ప్రశ్నిస్తున్నారు. మా పన్నుల రూపంలో వచ్చే డబ్బు మీకు కావాలి.. మా ప్రాజెక్టులకు మాత్రం నిధులు ఇవ్వకూడదన్నది కేంద్రంలోని బీజేపీ సిద్ధాంతామా అని కడిగి పారేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఇచ్చిన నిధులు ఎన్ని..? తెలంగాణకు ఇచ్చినవి ఎన్ని..? అంతెందుకు మన పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రానికి ఇచ్చిన ప్రాజెక్టులు, నిధులు ఎన్ని..? మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వరు..? అని బీఆర్‌ఎస్‌ ప్రశ్నిస్తోంది. ఇది ముమ్మాటికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై అనధికార నిషేధాన్ని విధించడమేనని తెలుపుతున్నారు.

రాష్ట్రంపై నెపం.. నిధుల్లో అన్యాయం
మొదట తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ లెటర్‌ రాస్తుంది. దాన్ని అలా చూస్తారో చూడరో కూడా స్పష్టం కాదు. కానీ వెంటనే తిరస్కరిస్తున్నట్లుగా కేంద్రం నుంచి ఓ ప్రకటన వెలువడుతుంది. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా కేంద్రం తెలుసుకునే పరిస్థితి లేదన్నది ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని బట్టి రాష్ట్రం కోరడం.. దాన్ని తిరస్కరించాలని కేంద్రం డిసైడ్‌ అవ్వడం ముందే నిర్ణయించినట్లుగా తేటతెల్లమవుతోందని బీఆర్‌ఎస్‌ నేతలు తెలుపుతున్నారు. తెలంగాణకు ఈ ఏడాది విడుదల కావాల్సిన నిధులు వచ్చే రెండు మూడేళ్ల వరకు పెండింగ్‌లో పెట్టడం, ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయకుండా అడ్డుకోవడం, ఆర్థిక సహాయం కోరితే సాధ్యం కాదని తిప్పి పంపడం, బడ్జెట్‌లో నిధులను పెంచాలని నీతి అయోగ్‌ సూచనలతో విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం లాంటివి తెలంగాణపై వివక్షకు నిదర్శనంగా మారుతున్నాయి.

- Advertisement -

సైలెంట్‌ వార్‌
ధాన్యం కొనుగోలులో లడాయి, విభజన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వంపై నెపం, 9 ఏళ్లలో ప్రతి బడ్జెట్‌లో అన్యాయం, కోచ్‌ ఫ్యాక్టరీ ఊసే ఎత్తరు, గిరిజన యూనివర్సిటీ అమలు ఎక్కడా..? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశంలోనూ కిరికిరి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేమని ప్రకటన, కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దు చేయడం ఇలా ప్రతి దాంట్లో తెలంగాణపై వివక్ష, అన్యాయం జరుగుతోందన్న విషయాన్ని ప్రజలకు తెలిపేలా బీఆర్‌ఎస్‌ ప్లాన్‌ చేస్తోంది. ఎన్నికల ముందు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ హామీని ఇచ్చింది. 100 రోజుల్లో తెస్తామంటూ బాండ్‌ పేపర్‌ మీద రాసిచ్చిన విషయాన్ని బీఆర్‌ఎస్‌ ఎత్తి చూపుతోంది. పసుపు బోర్డు ఎన్నికల హామీలో సాధ్యమైంది.. ఎన్నికలు అయిపోయాక సాధ్యం కాదా అని ప్రశ్నిస్తోంది.

మెట్రో -2 అసాధ్యమా..?
యూపీలో చిన్న పట్టణాల్లో మెట్రో పరుగులు పెడుతోంది. గుజరాత్‌లో దూసుకెళ్తోంది. మహారాష్ట్రలో నడుస్తుంది. కానీ కోటి 20 లక్షల జనాభా దాటిన హైదరాబాద్‌లో మెట్రో రెండో దశ సాధ్యం కాదంటూ ప్రకటించడంపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజల్లోనూ బీజేపీ తీరుపై కాస్త వ్యతిరేకత కొట్టొచ్చినట్లుగా స్పష్టం అవుతోంది. తెలంగాణ అంటే మాటల్లో ప్రేమను ఒలకబోయడం కాదు.. ప్రాజెక్టులు, నిధులు, అభివృద్ధికి సహకరించడం అని సూచిస్తున్నారు. అప్పుడే తెలంగాణ ప్రజానీకం నమ్ముతుందని తెలుపుతున్నారు.

మంత్రి కేటీఆర్‌ సెటైర్‌
తెలంగాణకు కేంద్రం చేస్తున్న తీరును మంత్రి కేటీఆర్‌ సెటైర్‌ రూపంలో ట్వీట్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన ప్రతిదానికి ఇవ్వం అనే సమాధానాన్ని కేంద్రం ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వం, పసుపు బోర్డు ఇవ్వం, మెట్రో రెండో దశ ఇవ్వం, ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్‌ ఇవ్వం, గిరిజన యూనివర్సిటీ ఇవ్వం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వం, ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వం అని ప్రధాని ప్రతి దానికి ఇవ్వననే సమాధానం ఇస్తున్నట్లుగా ట్వీట్‌లో స్పష్టం చేశారు. ప్రధాని ప్రాధాన్యతలో అసలు తెలంగాణ లేనప్పుడు, తెలంగాణ ప్రజల ప్రాధాన్యతలో ప్రధాని ఎందుకు ఉండాలి..? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి అని ప్రజలను ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement