Tuesday, April 16, 2024

మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ.. మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టుల ప్రత్యేక శిక్షణా తరగతులు ఈనెలలోనే నిర్వహించనున్నట్లు మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. హైదరాబాద్‌లోని మహిళా జర్నలిస్టులు మీడియా అకాడమీ మేనేజర్‌ ఎ. వనజ (సెల్‌ నెం. 770252489)ను సంప్రదించాలని, జిల్లాలలో పని చేసే మహిళా జర్నలిస్టులు ఆయా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మహిళా జర్నలిస్టులు – ప్రధాన స్రవంతి మీడియా మహిళల పాత్ర అనే అంశం, పాత్రికేయ రంగంలో మహిళలు ప్రత్యేక సమస్యలు అనే అంశాలపై ప్రసంగాలు ఉంటాయన్నారు.

రెండవ రోజు మహిళా అస్తిత్వం – జండర్‌ సెన్సీటైజేషన్‌ అనే అంశం, ఫీచర్‌ జర్నలిజం – మెళకువలు అంశాలపై ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో నిష్ణాతులైన వారి ప్రసంగాలు ఉంటాయని అల్లం నారాయణ తెలిపారు. ఈ శిక్షణా తరగుతుల్లో అకాడమీ ప్రచురణలు మహిళా జర్నలిస్టులకు అందజేస్తామన్నారు. శిక్షణా తరగతుల్లో రాష్ట్ర మహిళ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. గత నెలలో మీడియా అకాడమీ నిర్వహించిన దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతుల్లో దాదాపు 2000 మంది రాష్ట్ర నలుమూల నుంచి పాల్గొన్నారని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement