Thursday, April 25, 2024

జూన్ నాటికి 76 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు అందుబాటులోకి తీసుకురావాలి – సింగ‌రేణి ఎండి శ్రీధ‌ర్

హైద‌రాబాద్ – సింగరేణి సంస్థ చేపట్టిన మూడవ దశ సోలార్ విద్యుత్లో మిగిలి ఉన్న 76 మెగావాట్ల సోలార్ నిర్మాణం జూన్ నెల కల్లా పూర్తి చేయాలని సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ ఎండి ఎన్. శ్రీధర్ నిర్మాణ ఏజెన్సీలను ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో బుధవారం నిర్వహించిన సోలార్ విద్యుత్తు సమీక్ష సమావేశంలో ఆయన కొత్త ప్లాంట్ల నిర్మాణాలపై సంబంధిత అధికారుల‌తో చర్చించారు. సింగరేణి సంస్థ చేపట్టిన మొత్తం 300 మెగావాట్ల సామర్ధ్యం గల ప్లాంట్లలో ఇప్పటికే 224 మెగావాట్ల సామర్థ్యం గల 9 ప్లాంట్లను విజయవంతంగా పూర్తి చేసామని, మిగిలిన 76 మెగావాట్ల సామర్థ్యానికి సంబంధించి నిర్మించే ఐదు ప్లాంట్లను మే నెల కల్లా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ‌ల‌ను కోరారు.. జూన్ నెలలో తెలంగాణ ట్రాన్స్కోకు అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు.

సింగ‌రేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) శ్రీ డి సత్యనారాయణరావు ముందుగా నిర్మాణంలో ఉన్న ప్లాంట్ల గురించి వివరించారు. అనంతరం శ్రీధర్ నిర్మాణ ఏజెన్సీల ప్రతినిధులతో నేరుగా చర్చించారు. కాలపరిమితులు నిర్ణయించుకొని, రోజుకు రెండు షిఫ్టులలో పనులు చేపడుతూ మే నెల కల్లా పూర్తి చేయాలన్నారు. పూర్తయిన పనులకు వెంట వెంటనే బిల్లులు చెల్లించడం జరుగుతుందని, ఇంకా అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలు కంపెనీ తరపున అందిస్తామని హామీ ఇచ్చారు.
దీనిపై నిర్మాణ ఏజెన్సీలు అయిన జెన్సోల్, ఎన్రిచ్ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ నిర్ణీత గడువుకు ముందే నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తాము సాయిల్ టెస్టింగ్, సర్వే పనులు పూర్తి చేసామని, నిర్మాణ ప్రాంతాల్లోని భూమిని చదును చేసి ఉంచామని తెలిపారు. సోలార్ ప్యానల్స్, ఇతర సామాగ్రిని సమకూర్చుకుంటున్నామని ఏజెన్సీల ప్రతినిధులు వివరించారు. జూన్ నెల కల్లా నిర్మాణం పూర్తి చేయాల్సిన ప్లాంట్లలో కొత్తగూడెం ఏరియాలో 22.5 మెగావాట్ల ప్లాంట్, అదే ఏరియాలో మరో 10.5 మెగావాట్ల ప్లాంట్, చెన్నూరు వద్ద 11 మెగావాట్ల ప్లాంట్, రామగుండం-3 ఏరియాలోని ఓపెన్ కాస్ట్-1 ఓవర్ బర్డెన్ డంపుపై 22 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు ఉన్నాయ‌ని వివ‌రించారు. ఇది ఇలా ఉంటే వాటితో పాటు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నీటి జలాశయంపై ఇప్పటికే ప్రారంభించిన 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్తో పాటు అదే రిజర్వాయర్ పై నిర్మించే మరో 10 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయనున్నారు. సమీక్ష సమావేశంలో డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి. సత్యనారాయణరావుతో పాటు జీఎం (కోఆర్డినేషన్) ఎం. సురేష్, జీఎం (పర్చేజ్) మల్లెల సుబ్బారావు, జీఎం (సోలార్) జానకీరామ్, చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథరాజు, ఏజీఎం (ఫైనాన్స్) రాజేశ్వరరావు, ఏజీఎం (పర్చేజ్) నవీన్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement