Thursday, April 25, 2024

Siddipet : దివ్యాంగులకు ట్రై స్కూటీలు.. పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట : దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో 30 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా దివ్యాంగులకు 1,0, 4000 రూపాయిలు విలువైన ట్రై స్కూటీలను అందిస్తున్నదని తెలిపారు. చిరు వ్యాపారం చేసుకునే దివ్యాంగుల బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణాలు అందిస్తుందని మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగులకు రూ.3 వేలు పింఛన్లు ప్రతినెలా అందిస్తున్నారని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుగా ప్రగల్భాలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దివ్యాంగులకు కేవలం రూ.500, రూ.600 మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని మంత్రి చెప్పారు.

వికలాంగులను స్వయం ఉపాధి కోసం లక్ష రూపాయలు రుణాలను, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వారికి లక్ష రూపాయలు కల్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ వికలాంగుల సంక్షేమానికి పని చేస్తున్నారని, కొంతమంది సోషల్ మీడియాలో నిన్న మొన్న వచ్చి అవాక్కులు, చెవాక్కులు మాట్లాడుతున్నారని వారికి మీరంతా చెంప మీద కొట్టేలా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బట్ట కాల్చి మీదేసే విధంగా ఇష్టారీతిగా గోబెల్స్ ప్రచారాన్ని చేస్తున్న వారిని ప్రజలే తరిమికొట్టాలన్నారు. సీఎం కేసీఆర్ వల్లే నేడు వికలాంగులకు అన్ని రకాలుగా సౌకర్యాలు లభిస్తున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందుతున్న వారు కేసీఆర్ కు అండగా ఉండి ఆశీర్వదించాలన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వారి పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ.. సద్దితిన్న రేవు తలవాలని, సాయం చేసిన వారిని గుర్తుంచుకోవాలన్నారు.

సొంత ఖర్చులతో వికలాంగులకు ఉచిత బస్సు పాసులు పంపిణీ.

- Advertisement -

త్వరలోనే వికలాంగులకు సొంత ఖర్చులతో ఉచిత బస్సు పాసులు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇందు కోసం రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, సంబంధిత వికలాంగుల ధృవీకరణ పత్రాలు క్యాంపు కార్యాలయంలోని ఓఎస్డీ బాలరాజు, పీఏ రాముకు అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ సదవకాశాన్ని వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement