Friday, March 29, 2024

శ్రీరామనవమిని ఘనంగా నిర్వహించాలి.. మంత్రి గంగుల

శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఘనంగా నిర్వహించాలని పౌర సరపరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈనెల 28నుండి వచ్చే నెల 9వ తేదీ వరకు జరగబోయే శ్రీరామనవమి జాతర బ్రహ్మోత్సవాలపై సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం హుజురాబాద్ ఆర్డిఓ హరి సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ గణపతి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సిపి సుబ్బారాయుడుతో కలిసి రాగా ఆలయ అర్చకులు పూర్ణకుంభ మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి శాలువాతో సన్మానించి దేవుని చిత్రపటాలని అందజేశారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడుతూ… కరీంనగర్ జిల్లాలోని అతిపెద్ద దేవాలయంగా పేరు పొందిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ రాముని కళ్యాణాన్ని ఎలాంటి ఆవాంతరాలు కలగకుండా స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించాలని, వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. గత సంవత్సరం స్వామివారిని తీసుకొచ్చేటప్పుడు తోపులాట జరిగిందని, ఈసారి అలా జరగకుండా భారీగేట్లు ఏర్పాటు చేయాలని, పోలీస్ సిబ్బంది పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది భక్తులకు మందులు పంపిణీ చేయాలని, రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండి జాతర ఏర్పాట్లను చూసుకోవాలన్నారు. ఎప్పటిలాగే జమ్మికుంట రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేస్తున్న రైస్ మిల్లర్లకు అభినందనలు తెలిపిన మంత్రి గంగుల, స్వామీ కళ్యాణాన్ని వీక్షించడానికి 50 వేలకు పైగా భక్తులు వస్తారని, వారికి కావలసిన మంచినీటి సౌకర్యం టాయిలెట్స్, శానిటేషన్ ఎప్పటికప్పుడు నిర్వహించాలన్నారు. అలాగే మొబైల్ టాయిలెట్స్ కరీంనగర్ నుండి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బి వాళ్ళు భక్తులు క్యూ లైన్ లో వచ్చే విధంగా భారీ గేట్లు ఏర్పాటు చేయాలన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ… ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తామని, మొబైల్ టాయిలెట్స్ ను పంపిస్తామన్నారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయంగా పోటాపోటీగా ఫ్లెక్సీలు పెట్టుకోకూడదని, దేవునికి సంబంధించిన భక్తులు మాత్రమే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అలాగే ఆలయంలో జాతర పనుల కోసం ఫండ్స్ లేవని ఎమ్మెల్సీ, మంత్రి గంగుల కమలాకర్ కు తెలుపగా, ఏమైనా డిమాండ్స్ ఉంటే కలెక్టర్ కు రిపోర్ట్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఆర్ అండ్ బి వాళ్ళు గతంలో చేసిన పనులకే బిల్లులు రాలేదని, ఇప్పుడు ఎలా చేస్తామని తెలుపగా వెంటనే కలెక్టర్ కర్ణన్ పాత బిల్లు సాంక్షన్ చేస్తూ జరగబోయే పనులకు డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చారు. సిపి సుబ్బారాయుడు మాట్లాడుతూ.. కల్యాణానికి వచ్చే భక్తులకు పార్కింగ్, రవాణా సౌకర్యం, బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వo తరపున ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేస్తారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ… గత సంవత్సరం తోపులాట జరిగిందని, వీఐపీ పాసులు ఇచ్చేటప్పుడు చూసి ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ గణపతి, సిపి సుబ్బారాయుడు, డిసిపి శ్రీనివాస్, ఏసీబీ వెంకటరెడ్డి, ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, దేవాదాయ శాఖ ఏ.సీ ఏ చంద్రశేఖర్, ఆలయ నిర్వహణ అధికారికంగా సుధాకర్, సర్పంచ్ కంకణాల శ్రీలత సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ దంసాని విజయ లతోపాటు పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement