Friday, October 4, 2024

Basara: 3నుంచి శ‌ర‌న్న‌వరాత్రులు…

ముగ్గురు అమ్మ‌వార్ల దీవెన‌ల కోసం బాస‌ర పోదాం
ఏటా వైభ‌వంగా ద‌స‌రా న‌వ‌రాత్రులు
రోజుకో అవ‌తారంలో అమ్మ‌వారి ద‌ర్శ‌నం
దేశ న‌లుమూల‌ల నుంచి రానున్న వేలాది భ‌క్తులు
శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆల‌యంలో ముమ్మ‌ర ఏర్పాట్లు


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, బాస‌ర : నిర్మల్ జిల్లా గోదావరి నది తీరాన కొలువైన చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో శ‌ర‌న్న‌వరాత్రుల‌ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్స‌వాలు క‌ళ్ల‌రా వీక్షించ‌డానికి దేశ న‌లుమూల నుంచి వేలాది భ‌క్తులు హాజ‌రు కానున్నారు. బాస‌ర‌ క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాకాళి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ముగ్గురు అమ్మ‌వార్లు కొలువై ఉండడంతో ఇక్క‌డ ఆల‌యానికి ఒక‌ విశిష్ట‌త ఉంది. తొమ్మిది రోజుల పాటు ముగ్గురు అమ్మవార్లను కొలిచేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తారు. నవరాత్రి ఉత్సవాలలో అమ్మవార్లకు దేవాదాయ శాఖ తరఫున పట్టు వస్త్రాలను స‌మ‌ర్పిస్తుంది.

బాస‌ర క్షేత్రం విశిష్ట‌త‌…
బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి, తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వ‌చ్చారు. ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై కుటీరం నిర్మించారు. ఆ కుటీరంలో తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురు అమ్మ‌వార్ల‌కు ఆలయాన్ని నిర్మించమని సూచించింది. వ్యాసుడు నది లోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులును ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంత కాలం నివసించాడని పురాణ క‌థ‌నాలు ఉన్నాయి. కనుక అప్పటి నుండి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసర అనబడి పిలిచే వారు.

- Advertisement -

మహారాష్ట్ర ప్రజల ప్రభావం వ‌ల్ల రానురాను ‘బాసర’ గా నామాంతరాన్ని సంతరించుకుంది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానం లభిస్తుందని భ‌క్తుల విశ్వాసం. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్ఠించి రామాయణం రాసాడ‌ని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి, పాలరాతి శిల ఉన్నాయి. మంజీరా, గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతుంది. ఆరో శతాబ్దంలో నందగిరి ప్రాంతాంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయాన్ని నిర్మించాడన్న కథనం ప్రచారంలో ఉంది.

200 ఏళ్ల కింద పున‌ర్నిర్మాణం…
సుమారు 200 సంవత్సరాల క్రితం మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.
ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగాన నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహం, వ్యాస లింగం ఉన్నాయి. మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలమంటారు. అక్కడ “వేదవతి” (ధనపు గుండు) అనే శిలపై తడితే ఒక్కోప్రక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో ఎనిమిది (ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణుతీర్థం, గణేషతీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం) పుష్క‌రిణులున్నాయి.

బాసరలో సరస్వతి ప్ర‌త్యేక‌త‌
బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి భ‌క్తులు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె పంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు.

న‌వ రూపాల్లో అమ్మ‌వార్ల ద‌ర్శ‌నం
దేవి నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రూపంతో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వడం సంప్ర‌దాయం. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిని, మూడవ రోజు చంద్రగంట, నాల్గవ రోజు కుష్మాండ అవతారం, ఐదవ రోజు స్కంద మాత, ఆరవ రోజు కాత్యాయని అవతారం, ఏడవ రోజు కాలరాత్రి అలంకారం, ఎనిమిదవ రోజు మహా గౌరీ , తొమ్మిద‌వ రోజు సిద్ధ ధాత్రి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవార్లకు ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం ఆలయ అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి సమర్పిస్తారు.

వ‌చ్చే నెల మూడు నుంచి ఉత్స‌వాలు
దేవి శరన్నవరాత్రి ఉత్స‌వాల్లో భాగంగా 03.10.2024 నుండి 12.10.2024 వరకు ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం చతుఃషష్ఠి (64) ఉపచారలతో మాహా పూజలు, విశేష లలితా సహస్ర నామ కుంకుమార్చన, మాహావిద్యా పారాయణ చండి పారాయణ విశేష నైవేద్యములు వివిధ ప్రత్యేక పూజలు నిర్వ‌హ‌ణ‌కు ఆల‌య అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుండి తొమ్మిది రోజులు ఆలయంలోని శ్రీ మహాకళీ, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవార్లకు అభిషేకం కూడా నిర్వ‌హిస్తారు.

న‌వ‌రాత్రుల్లో మూలా న‌క్ష‌త్రం రోజున అక్ష‌ర శ్రీ‌క‌ర పూజ‌లు
దేశంలోని రెండు సరస్వతి ఆలయాలలో ఒకటి కాశ్మీర్ రాష్ట్రంలో ఉండగా మరొకటి తెలంగాణ రాష్ట్రం బాసరలో కలదు. ఈ క్షేత్రంలో అమ్మవారి చెంత చిన్నారులకు అక్ష‌ర‌భ్యాసం నిర్వ‌హిస్తారు. దేశంలోని పలు రాష్ట్రాల నుండి భక్తులు తమ చిన్నారులకు అక్షర స్వీకార పూజలు జరిపించడానికి ప్రతిరోజు వేల సంఖ్యలో తరలివస్తారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున అక్షర శ్రీకర పూజలు జరిపిస్తే చిన్నారులు ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు, పోలీసులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

సాధార‌ణ రోజుల్లో ద‌ర్శ‌నాలు
ప్రతి నిత్యం ఉదయం 4 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా అభిషేక పూజ చేస్తారు. అనంతరం ఉదయం 7:30 కి అక్షరాభ్యాస పూజలు ప్రారంభించి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వ‌హిస్తారు. విద్యా ప్రాప్తికై ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి దేవికి పలక, బలపం, కాగితం, కలం వంటి కానుకలు సమర్పించే సంప్ర‌దాయం ఉంది. కేశ ఖండనం, ఉపనయనం, వివాహాలు, భజనలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఉదయం నాలుగు గంటలకు ఆలయాన్ని తెరుస్తారు.

నాలుగు గంటల నుండి 6:30 గంటల వరకు అభిషేకం, అలంకారం, హారతి, నైవేద్యం చేసి ప్రసాద వితరణ చేస్తారు. 7.30 గంటల నుండి 12.30 గంటల వరకు అర్చన, సర్వదర్శనం అక్షరాభ్యాస పూజలు నిర్వ‌హిస్తారు. 12.30 గంటలకు నివేదన చేసి ఆలయం రెండు గంటవరకు మూసి ఉంచుతారు. రెండు గంటల నుండి 6.30 గంటల వరకు అర్చన సర్వదర్శనం అక్షరాభ్యాసం చేస్తారు. ఉంద‌యం 6.30 గంటల నుండి ఏడు గంటల వరకు ప్రదోష పూజ నిర్వహిస్తారు. రాత్రి ఏడు గంటల నుండి 8.30 గంటల వరకు మహా హారతి దర్శనం తరువాత ఆలయం మూసి వేస్తారు.

బాస‌ర కు ఇలా రావొచ్చు…
బాస‌ర క్షేత్రానికి రైళ్లు, బ‌స్సు సౌక‌ర్యాలు ఉన్నాయి. రోడ్డు మార్గంలో వ‌చ్చే వారు హైద‌రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా బాస‌ర‌కు 207 కిలో మీట‌ర్లు దూరం ఉంటుంది. జిల్లా కేంద్ర‌మైన నిర్మల్ ప‌ట్ట‌ణం నుంచి 75 కిలో మీట‌ర్ల దూరంలో ఉంటుంది. నిజామాబాద్ నుంచి 30 కిలో మీట‌ర్ల దూరంలో బాస‌ర ఉంది. సికింద్రాబాద్ నుంచి బాస‌ర నేరుగా రైళ్లు ఉన్నాయి. హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది. అలాగే టీజీ ఆర్‌టీసీ బ‌స్సులో వ‌చ్చే వారు సికింద్రాబాద్ లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ సౌక‌ర్యం క‌ల‌దు. నిజామాబాద్ నుంచి ప్ర‌త్యేక బ‌స్సులు కూడా ఆర్టీసీ వారు న‌డుపుతుంటారు.

న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌కు అన్ని ఏర్పాట్లు : ఈఓ విజ‌య‌రామారావు
బాస‌ర క్షేత్రంలో జ‌రిగే నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఆల‌య ఈఓ విజ‌య రామారావు తెలిపారు. భ‌క్తులు ఎలాంటి ఇబ్బంది ప‌డ‌కుండా సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. అక్షర శ్రీకర పూజలకు వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నదానం, వసతి ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. ప్రత్యేక అక్షరాభ్యాసం మండపాలు, అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్, అక్షరభ్యస పూజలకు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయ‌ని చెప్పారు. అలాగే ఉప అలయాలను రంగులు వేసి విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నామ‌ని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా భారీగా పోలీసుల బందోబస్తు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement