Thursday, March 28, 2024

తెలంగాణను శత్రువుగా చూస్తున్నారు.. ఎందుకింత వివక్ష: అఖిలపక్ష భేటీలో టీఆర్ఎస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని శత్రువులా చూస్తోందని టీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. సోమవారం మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని ఖూనీ చేస్తోందని నేతలిద్దరూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా కేంద్రం అమలు చేయలేదని ధ్వజమెత్తారు. కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదని, ఎందుకు ఇంత వివక్ష ప్రదర్శిస్తున్నారని నిలదీశారు. కేంద్రం విడుదల చేయాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం ఇవ్వాల్సిన రూ.450 కోట్ల బకాయిల గురించి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, విడుదల చేయడం లేదని ఆరోపించారు.

దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఉపాధి కల్పనకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని నేతలిద్దరూ విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న జిఎస్టీ, ఐజిఎస్టీ నిధులను రాష్ట్రాలకు విడుదల చేయడం లేదని అన్నారు. వరి ధాన్యం సేకరణలో జాతీయ సమగ్ర ధాన్యం సేకరణ విధానాన్ని తీసుకురావాలని కేంద్రానికి సూచించారు. బాయిల్డ్ రైస్ సమస్య ఒడిశాతో పాటు అనేక రాష్ట్రాలను బాధిస్తోందని కే.కేశవరావు అన్నారు. మెజారిటీ ఉందని ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఐటి, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని, ఇప్పుడు పార్లమెంట్‌ను కూడా వాడుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఉదాహరణకు ప్రివిలేజ్ కమిటీని కూడా ఒక అస్త్రంగా ప్రయోగిస్తున్నారంటూ బండి సంజయ్ ఘటనను పరోక్షంగా ప్రస్తావించారు. పార్లమెంట్‌ను, కేంద్ర సంస్థలను తాము కించపరచడం లేదని, కానీ కేంద్ర ప్రభుత్వం తన అవసరాలకు వీటిని ఉపయోగించవద్దని కోరుతున్నామని కేశవరావు అన్నారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. పెగాసస్ స్పైవేర్ సమస్య జాతీయ భద్రతకు సంబంధించిందని, చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement