Thursday, April 25, 2024

వ‌ర‌ద‌లో కొట్టుకుపోయిన ఆర్టీసీ బ‌స్సు

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట వద్ద వరదలో చిక్కుకున్న సిద్దిపేట ఆర్టీసీ డిపో బస్సు కొట్టుకుపోయింది. లోలెవల్‌ వంతెనపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆర్టీసీ బస్సు సోమవారం వంతెన అంచు వరకు కొట్టుకు వెళ్లింది. దాంతో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు కేకలు వేయడంతో స్థానిక రైతులు వారిని రక్షించారు. ఆ బ‌స్సును జేసీబీ స‌హాయంతో బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ విఫ‌ల‌మైంది. ఈరోజు ఉదయం వరద ఉద్ధృతి మరింత పెరగడంతో లోలెవల్‌ వంతెన అంచున ఉన్న ఆర్టీసీ బస్సు వాగులో కొట్టుకుపోయింది.

సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి 25 మంది ప్రయాణికులతో గంభీరావుపేట మీదుగా సిద్దిపేటకు వెళ్తున్నది. ఈ క్రమంలో సోమవారం కురిసిన వర్షానికి నర్మాల ఎగువ మానేరు మత్తడి దుంకడంతో లింగన్నపేట వద్ద మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. శివారులోని లోలెవ‌ల్ బ్రిడ్జి మీదుగా వరద వెళ్తున్నది. అయితే డ్రైవర్‌ గమనించకుండా బస్సును లోలెవ‌ల్ బ్రిడ్జి మీదుగా తీసుకెళ్లగా, నీటి ప్రవాహానికి బస్సు అదుపు తప్పింది. బ్రిడ్జి అంచున బ‌స్సు చిక్కుకుంది. స్థానికులు గమనించి ప్రయాణికులను తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: ఇసుక మైనింగ్ పై టిడిపి నేతల ఆరోపణలు అవాస్తవాలే

Advertisement

తాజా వార్తలు

Advertisement