Friday, April 19, 2024

వచ్చే బడ్జెట్ లో దళిత బంధు పథకానికి రూ.20వేల కోట్లు : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చెయ్యడానికి వచ్చే వార్షిక బడ్జెట్ లో రూ.20 వేల కోట్ల నిధులు కేటాయించనున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దళిత అణగారిన కుటుంబాలకు ఆర్థిక స్వాలంబన అందించి అభివృద్ధి పరిచే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఎక్కడాలేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రతి నియోజకవర్గం నుండి సంక్రాతి పండగ తర్వాత 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఏప్రిల్ 1 నాటికి గ్రౌండింగ్ చేయాలని సూచించారు. జిల్లా మొత్తం జనాభా లో 15శాతం దళితులున్నారని, మార్కెట్లో డిమాండ్ ఉన్న వ్యాపారాలు డైరీఫామ్, పౌల్ట్రీ పరిశ్రమలు, వ్యవసాయ పనిముట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మొదలైన పథకాలను నిర్ధారించాలన్నారు. నిర్మల్ జిల్లాలోని ఏయే నియోజకవర్గాల్లో ఎటువంటి వ్యాపారాలు చేస్తే లాభసాటిగా ఉంటుందో ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు దళిత నాయకులు, ఉద్యోగసంఘాల నాయకులను అడిగి తెలుసుకోవాలన్నారు. భవిష్యత్తులో గిరిజనులకు, వెనుకబడిన తరగతుల వారికి కూడా దళిత బంధు లాంటి పథకాన్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి అన్నారు.

జిల్లాలో పెండింగ్ లో ఉన్న చెక్ డ్యామ్ లు వెంటనే పూర్తి చేయాలని, చెడిపోయిన రోడ్ల మరమ్మతులను చేపట్టాలని, అర్లీ బ్రిడ్జి మరమ్మత్తులు చేయాలని, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అంబేడ్కర్ భవనం నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ముథోల్ శాసనసభ్యులు విట్టల్ రెడ్డి మాట్లాడుతూ… తమ నియోజకవర్గంలో అందరితో చర్చించి లబ్ధిదారుల ఎంపిక చేస్తామన్నారు. ఏ పథకమైనా అందరికీ చేరాలంటే కొంత సమయం పడుతుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖి మాట్లాడుతూ… దళిత బంధు పథకంలో ఒక లబ్ధిదారుడు నాలుగు వ్యాపారాలు చేయవచ్చని, ఒకే వ్యాపారాన్ని కొంతమంది కలిసి కూడా చేసే విధంగా వెసులుబాటు ఉందన్నారు. ఏ ఒక్క శాఖ కు పరిమితం కాకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల ప్రమేయం ఉండాలని, లబ్ధిదారుల ఎంపికలో ఆయా శాఖల అధికారులు బాధ్యత వహించాలన్నారు. ఈ పథకం పూర్తిస్థాయిలో వినియోగించుకునే లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన రెవెన్యూ, ఆరోగ్య, పోలీస్, పంచాయితీ శాఖల సిబ్బంది, సీనియర్ సిటిజెన్స్ కు నేటి నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ ప‌ర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి రాంకిషన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్ఖడే, పి.రాంబాబు, డీఎఫ్ఓ వికాస్ మీనా, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్ రామ్ రెడ్డి, భైంసా మున్సిపల్ చైర్మన్ జావీద్ అహ్మద్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజేందర్, గ్రంధాలయం చైర్మన్ రాజేందర్, నిర్మల్ జడ్పీటీసీ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, అన్ని మండలాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, దళిత సంఘాల నాయకులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement