Monday, November 4, 2024

TG: సూక్ష‌, చిన్న‌, మ‌ధ్య ప‌రిశ్ర‌మ‌ల‌కు చేయూత‌.. కొత్త విధివిధానాలు ప్ర‌క‌టించిన రేవంత్

హైద‌రాబాద్ – ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపన, అభివృద్ధి దిశగా చర్యలకు పూనుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకువచ్చింది. ఎంఎస్ఎంఈ పాలసీ-2024ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. మాదాపూర్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో ఈ పాలసీని సీఎం విడుదల చేశారు.

అవే ప్ర‌ధాన అడ్డంకులు..
ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న ఆరు అడ్డంకులను ఈ కొత్త పాలసీ ద్వారా ప్రభుత్వం గుర్తించింది. 1)భూమి సౌలభ్యత, 2)మూలధన లభ్యత, 3)ముడిపదార్థాల అందుబాటు, 4)శ్రామిక శక్తి కొరత, 5)సాంకేతిక సౌలభ్యత లేకపోవడం, 5) మార్కెట్ లతో అనుసంధానం లేకపోవడం వంటి అంశాలు తెలంగాణలోని ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ అడ్డంకులను తొలగించడానికి 40ప్రతిపాదనలు చేసింది. సరసమైన ధరలకు భూమిని అందించడం, ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచడం, ముడి పదార్థాల లభ్యతను అందుబాటులో ఉంచడం, నైపుణ్యం గల కార్మికుల లభ్యత మెరుగు పరచడం, నూతన సాంకేతికతను ప్రోత్సహించడం, మార్కెట్ లతో అనుసంధానత మెరుగుపరచడం వంటి అంశాలతో ఎంఎస్ఎంఈలకు దన్నుగా నిలవబోతున్నట్లు పాలసీలో పేర్కొంది.

మహిళలు, ఎస్సీ ఎస్టీలకు ప్లాట్లు రిజర్వు…
ప్రభుత్వం నిర్మించాలని భావిస్తున్న ప్రతి పారిశ్రామిక పార్కులో 20 శాతం ప్లాట్లు ఎంఎస్ఎంఈల కోసం రిజర్వు చేయనున్నట్లు కొత్త పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామికి పార్కు ఏర్పాటు చేయబోతున్నామని, అలాగే ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య 10పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం నిర్మించబోతున్నదని తెలిపింది. ఈ 10 పారిశ్రామిక పార్కుల్లో 5 ఎంఎస్ఎంఈ పార్కులు ఉండనుండగా వీటిలోని ప్రతి ఎంఎస్ఎంఈ పార్కులో 5 శాతం ప్లాట్లు మహిళా పారిశ్రామిక వేత్తలకు 15శాతం ప్లాట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రిజర్వ్ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఎంఎస్ఎంఈలను సమర్థవంతంగా అమలుపరిచి నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నదని, ఎంఎస్ఎంఈల కోసం ప్రభుత్వం 24/7 పని చేయనున్నదని పేర్కొంది.

- Advertisement -

టీఎస్ ఐ పాస్ తో పెద్ద కంపెనీలకే ప్రయోజనం : జయేశ్ రంజన్
గతంలో ఉన్న ఉన్న టీఎస్ ఐపాస్ పాలసీ వల్ల పెద్ద పెద్ద కంపెనీలకే ప్రయోజనం ఉందని, అందువల్ల కొత్త ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈల కోసం పాలసీ ఉండాలని సూచించారని ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ చెప్పారు.

దేశంలో ఎంఎస్ఎంఈలకు సంబంధించి మన రాష్ట్రం మధ్యస్థంగా ఉందని ఈ పరిస్థితి నుంచి మెరుగుపడేలా ఈ నూతన పాలసీ రూపొందించామన్నారు. కంపెనీలు, సంస్థలతో పోలిస్తే ఎంఎస్ఎంఈలు అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొంటున్నాయని, వీటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందిచాలనేది ఈ పాలసీలో పొందుపరిచామన్నారు. ఈ ఎంఎస్ఎంఈలకు మానవ వనరులు అందుబాటులో ఉండాలని చూస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన ఎంఎస్ఎంఈ పాలసీ రూపొందించామన్నారు. నూతన ఎంఎస్ఎంఈ పాలసీపై చాల నమ్మకం ఉందన్నారు. ఈ పాలసీని అమలు చేసేందుకు పరిశ్రమల శాఖ నుంచి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులు, పరిశ్రమల శాఖకు సంబంధించిన 22 అసోసియేషన్స్ ప్రతినిధులు, ఉత్సాహవంతులైన పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement