Thursday, April 25, 2024

తాండూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా : ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

తాండూరు: తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఢంకా బజాయించారు. అధిష్టానం తనకే టిక్కెట్టు ఇస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో మీడియాతో సమావేశమైన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేయడం ఖాయమన్నారు. సిట్టింగులకు టిక్కెట్టు ఇచ్చే విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, గతంలో వికారాబాద్, మేడ్చల్ నియోజకవర్గాల్లో సిట్టింగులకు టిక్కెట్టు ఇవ్వలేదని ఉదహరించారు. కొందరు స్వార్థపరులే ఎమ్మెల్యే వెంట వెళ్లారని, అయినా వాళ్లందరూ టచ్ లో ఉన్నారని తెలిపారు. వాళ్లను ఎప్పుడు పిలిచినా వస్తారన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నేతలే ఉన్నారని విమర్శించారు. మంత్రి పదవిపై అధిష్టానం చేతుల్లో ఉందని, సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు. మరోవైపు మున్సిపల్ చైర్ పర్సన్ పదవిపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పందించారు. వచ్చే ఐదేళ్ల వరకు ఆమె పదవికి డోకా ఉండదన్నారు. మెజార్టీ కౌన్సిలర్లు ఆమెకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఒకవేళ అవిశ్వాసం పెట్టాలనుకున్నా.. నాలుగేళ్ల వరకు వీల్లేదని అన్నారు. అప్పుడు పెట్టినా కూడా గెలుస్తామన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement