Wednesday, April 24, 2024

భారీగా గుట్కా ప్యాకెట్ల ప‌ట్టివేత‌.. తనిఖీలో గుట్టు ర‌ట్టు..

తాండూరు రూరల్ : కర్ణాటక రాష్ట్రం నుంచి సరిహద్దు ద్వారా వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.60 వేల విలువైన నిషేధిత ప్యాకెట్లను పట్టుకుని వ్యాపారిపై కేసు నమోదు చేశారు. సోమవారం తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ కేసు వివరాలను వెల్లడించారు. వికారాబాద్ ప్రాంతానికి చెందిన ఉప్పరి బాలరాజు ఆదివారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం చించోల్లిలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను ఆర్టీసీ బస్సులో తెలంగాణ ప్రాంతానికి తీసుకవస్తున్నాడు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ పర్యవేక్షణలో తాండూరు మండలంలోని కొత్లాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన చెకోపోస్టులో నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కూడ ఆదివారం సాయంత్రం విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లు అశోక్ కుమార్, ప్రవీణ్ లు తనిఖీలు చేయగా ఉప్పరి బాలరాజుకు చెందిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డికి సమాచారం అందించారు.

ఉప్పరి బాలరాజును అదుపులోకి తీసుకుని విచారించగా కర్ణాటక రాష్ట్రం చించొల్లి నుంచి తరలించినట్లు తెలిపాడు. సోమవారం తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ మీడియాతో సమావేశమై కేసు వివరాలను వెల్లడించారు. ఉప్పరి బాలరాజు నుంచి స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ రూ.60వేలు ఉంటుందన్నారు. భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఉప్పరి బాలరాజు గుట్కా ప్యాకెట్లను కర్ణాటక నుంచి తీసుకవచ్చి వికారాబాద్ ప్రాంతంలోని పాన్ డబ్బాలు, కిరాణా షాపులకు సరఫరా చేసేవాడని వివరించారు. ‘ ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా తాండూరు ప్రాంతంలో నిషేధిత గుట్కా ప్యాకెట్ల రవాణా నియంత్రణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా అక్రమ వ్యాపారానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement