Thursday, March 28, 2024

లాక్‌డౌన్‌’తోనే కోవిడ్‌ కట్టడి..!

వికారాబాద్‌ .. ప్రభన్యూస్‌ ప్రతినిధి : కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు. రాత్రి కర్ఫ్యూ విధించినా పెద్దగా కేసుల సంఖ్య తగ్గడం లేదు. రాత్రి కర్ఫ్యూకు తోడు ప్రభుత్వం కొన్ని ఆంక్షలను అమలు చేస్తోంది. అయినా కూడా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. పక్క రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితిని లాక్‌డౌన్‌ ద్వారా అధికమించారు. మహారాష్ట్ర.. కర్ణాటక రాష్ట్రాలలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేసి కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేశారు. ఇక్కడా అలాంటి లాక్‌డౌన్‌ను అమలు చేయాలనే డిమాండ్‌ వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం సైతం లాక్‌డౌన్‌ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏక్షణమైనా లాక్‌డౌన్‌పై నిర్ణయం వెలువరించే అవకాశం కనిపిస్తోంది.

జిల్లాలో కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం నిర్వహించే పరీక్షలలో ప్రతిరోజు 300 మందికిపైగా వైరస్‌ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలో కోవిడ్‌ పాజిటివ్‌ శాతం అధికంగా ఉన్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1253 పరీక్షలు నిర్వహించగా 341కి కోవిడ్‌ పాటిజివ్‌గా వచ్చింది. అంటే పాజిటివ్‌ శాతం 25 శాతం వరకు ఉంది. అంటే వంద మందికి పరీక్షలు నిర్వహిస్తే వారిలో 25 మందికి పాజిటివ్‌ వస్తోంది. రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్‌ శాతం ఉన్న జిల్లాలలో వికారాబాద్‌ మూడో స్థానంలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలను చేపట్టింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కప్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఈ కర్ఫ్యూ ప్రభావం పాజిటివ్‌ కేసులపై ఏమాత్రం చూపడం లేదు. ఉదయం వేళ యథావిధిగా ప్రజలు ఎలాంటి కోవిడ్‌ నిబంధనలు పాటించకుండానే మార్కెట్లకు పోటెత్తుతున్నారు. యధేచ్ఛగా ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగుతున్నాయి. సరిహద్దులలో అంతర్‌రాష్ట్ర రవాణాపై కూడా ఆంక్షలు లేకపోవడం గమనార్హం.

ఈ పరిస్థితిని అధికమించేందుకు లాక్‌డౌన్‌ విధించాలనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. కేంద్రం కూడా లాక్‌డౌన్‌పై తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. లాక్‌డౌన్‌ విధించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్య అధికంగా ఉండడంతో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. పొరుగున ఉన్న కర్ణాటకలో కూడా రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను విధించారు. ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూను అమలు చేయేలాని నిర్ణయించారు. లాక్‌డౌన్‌తో మహారాష్ట్ర..కర్ణాటకలో కేసుల సంఖ్య తగ్గినట్లు..వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసినట్లు అక్కడి వైద్య అధికారులు ప్రకటించారు. మరోవైపు సుప్రీం కోర్టు..హైకోర్టులు కూడా లాక్‌డౌన్‌ విధించడంపై నిర్ణయం తెలియజేయాలని కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం గమనార్హం.

కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయాలంటే రెండు వారాల లాక్‌డౌన్‌ను అమలు చేయాలని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తే ఎక్కడి వారు అక్కడే ఉండిపోతారని.. దీంతో వైరస్‌ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు సైతం ఇళ్లలోనే ఉండి రెండు వారాల లాక్‌డౌన్‌ సమయంలో కోలుకుంటారని గుర్తుచేస్తున్నారు. లాక్‌డౌన్‌తో కొత్త పాజిటివ్‌ కేసులు తగ్గడంతో పాటు ప్రభుత్వ..ప్రైవేటు ఆసుపత్రులపై భారం తగ్గుతుందని పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ తరువాత పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు సులభంగా ప్రభుత్వ.. ప్రైవేటులో చికిత్స లభించే అవకాశం లభిస్తుందని వైద్య వర్గాలు వివరిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement