Thursday, April 18, 2024

బహిరంగంగా గుట్కా అమ్మకాలు.. నిద్రవీడని టాస్క్ ఫోర్స్

(ప్రభన్యూస్‌బ్యూరో,ఉమ్మడిరంగారెడ్డి) : గుట్కా అమ్మకాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. ఎక్కడినుండి వస్తోంది…ఎక్కడికి తరలిస్తున్నారనే విషయపై నిఘా వ్యవస్థ పసిగట్టి అక్రమ రవాణాను నివారించాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాలో గుట్కా గుప్పుమంటోంది. కానీ ఎక్కడా కూడా నివారణ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రభుత్వం పూర్తిగా నిఘా వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. నిఘా వ్యవస్థ ఇచ్చే సమాచారం మేరకు చర్యలు తీసుకుంటారు. కానీ గుట్కా విషయంలో నిఘా వ్యవస్థకు చిక్కకుండా వ్యాపారం కొనసాగుతోందా లేక కావాలని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా అనేది ఆలోచించాల్సిన విషయం. వందల కోట్ల గుట్కా వ్యాపారం కొనసాగుతున్నా నిఘా వ్యవస్థ మాత్రం గుర్తించలేకపోతోంది. హైదరాబాద్‌ మహానగరం చుట్టూరా రంగారెడ్డి…మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలు విస్తరించి ఉన్నాయి. ఇందులో శివారు ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాలు కూడా ఉన్నాయి. శివార్లలో గోడౌన్లు ఏర్పాటు చేసుకుని అక్కడినుండి రాత్రి పూట వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నారంటే వ్యాపారుల నెట్‌వర్క్‌ ఎంతుందో తెలిసిపోతోంది. అంతకంటే ఎక్కువగా ఉన్న నిఘా వ్యవస్థ గుట్కా వ్యాపారుల నెట్‌వర్క్‌ ను గుర్తించలేకపోతోంది. నిఘా వ్యవస్థ ఇచ్చే సమాచారాన్ని బట్టి పోలీసులు చర్యలు తీసుకుంటారు. పోలీసులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో మిగతా శాఖలైనా చర్యలు తీసుకుంటారనుకుంటే అది కూడా లేకుండాపోయింది. ఎస్‌వోటీ పోలీసులు నేరుగా దాడులుచేసి స్థానిక పోలీసులకు అప్పగించే అధికారం ఉంటుంది. ఎస్‌వోటీ పోలీసులు కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గుర్తుకు వచ్చినప్పుడు తప్పిస్తే పెద్దగా గుట్కా అక్రమ రవాణా విషయంలో పెద్దగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. నిఘా వ్యవస్థతోపాటు ఎస్‌వోటీ పోలీసులు తలుచుకుంటే కొన్ని రోజుల వ్యవధిలోనే గుట్కా అక్రమ వ్యాపారానికి బ్రేకులు వేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ మనకెందుకులే అనుకుంటున్నాట్లు ఉన్నారు. అందుకే గుట్కా వ్యాపారంపై సరియైన విధంగా నిఘా పెట్టడం లేదనేది వాస్తవం….

ప్రభుత్వ ఆదేశాలు భేఖాతరు..

గంజాయి…గుట్కా అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోలీసు ఉన్నతాధికారులు కూడా క్రమం తప్పకుండా తనిఖీలు చేసి గుట్కాను పూర్తిగా నివారించాలని సూచనలు చేశారు. కానీ స్థానిక పోలీసులు మాత్రం గుట్కా అమ్మకాలపై పెద్దగా దృష్టిని కేంద్రీకరించినట్లు కనిపించడం లేదు. మనకెందుకులే అనుకుంటున్నారో ఏమో తనిఖీలు నామమాత్రంగా చేస్తూ పరోక్షంగా గుట్కా వ్యాపారులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు బహిరంగంగా ప్రచారం సాగుతోంది. పాన్‌ డబ్బాను మొదలుకుని చిన్నపాటి కిరణా దుకాణంలో కూడా గుట్కా అమ్మకాలు జరుగుతున్నాయి ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. కానీ సరియైన విధంగా కట్టడి చేయకపోవడంతోనే గల్లిdగల్లిdలో గుట్కా అమ్మకాలు జరుగుతున్నాయి. గుట్కా ద్వారా ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. అందుకే కొన్నిరాష్ట్రాల మినహా గుట్కా తయారీని…అమ్మకాలను నిషేధించారు. గుట్కా అమ్మకాలను ఎప్పటికప్పుడు పసిగట్టి బ్రేకులు వేయాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు….

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జోరుగా వ్యాపారం..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోగుట్కా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. శివార్లను అడ్డాలుగా చేసుకుని గుట్కా వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారు. శివార్లు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎలాంటి వ్యాపారాలు జరుగుతున్నాయనే విషయమై పోలీసులకు సరియైన సమాచారం లేకుండాపోయింది. పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని గుట్కా వ్యాపారం చేస్తున్నారు. గుట్కా గోడౌన్ల పరిసర ప్రాంతాల్లో చీమ చిటుక్కుమన్న ఇట్టే తెలిసిపోయేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. వారి అనుమతి లేకుండా గోడౌన్ల వైపు ఎవరూ కూడా కన్నెత్తి చూసే పరిస్థితులు లేవు. ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తున్నా పోలీసులకు మాత్రం కనీస సమాచారం ఉండటం లేదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement