Friday, March 29, 2024

మిస్సింగ్‌, మిస్టరీ.. వికారాబాద్ జిల్లాలో పెరుగుతున్న కేసులు

(ప్రభన్యూస్‌ ప్రతినిధి, వికారాబాద్‌) : రాష్ట్ర సరిహద్దులో ఉన్న జిల్లాలో మిస్సింగ్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. 2020 డిసెంబర్‌ నాటికి జిల్లాలో 201 మిస్సింగ్‌ కేసులు నమోదు కాగా 2021లో ఏకంగా 249 కేసులు నమోదు కావడం గమనార్హం. మానవ అక్రమ రవాణాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో మిస్సింగ్‌ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దులో ఉన్న జిల్లాలో ఇలాంటి కేసుల సంఖ్య పెరగడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మిస్సింగ్‌ కేసులలో ఎక్కువగా మహిళలు..యువతులు ఉండడం మరింత కలకలం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం బషీరాబాద్‌ తండాకు చెందిన ఒక వివాహిత అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తాండూరు మండల పరిధిలో కూడా రెండు మిస్సింగ్‌ కేసులు ఇటీవల నమోదు అయ్యాయి. కరణ్‌కోట్‌ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. ఇద్దరు కూడా వివాహిత మహిళలు కావడం గమనార్హం. ఈ రెండు కేసులలో కూడా పురోగతి లేదు. గత జూన్‌లో తాండూరు మండలం కొత్లాపూర్‌లో ఒక మహిళ అదృశ్యమైంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారం తరువాత తిరిగి ప్రత్యక్షమైంది. జిల్లాలోని తాండూరు ప్రాంతంలో ఎక్కువగా మిస్సింగ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ ప్రాంతం పూర్తిగా రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. తాండూరు పట్టణంకు చెందిన బిఎస్పీ నేత సత్యమూర్తి సతీమణి అన్నపూర్ణ గత మార్చిలో అదృశ్యమైంది. ఇప్పటి వరకు ఆమె ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు..పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టినా ప్రయోజనం కనిపించలేదు. అన్నపూర్ణ ఆచూకీ కనిపెట్టడం పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. అనేక కోణాలలో ధర్యాప్తు చేసినా కూడా అన్నపూర్ణ జాడ తెలియడం లేదు.

తన భార్య ఆచూకీని కనిపెట్టాలని భర్త సత్యమూర్తి ఇద్దరు పిల్లలతో సహా అజ్ఞాతంలోకి వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అన్నపూర్ణ అదృశ్యం కేసును ప్రాధాన్యతగా తీసుకొని ధర్యాప్తు చేస్తామని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కూడా ప్రకటించారు. ఇందుకు ప్రత్యేక పోలీసు బృందంను నియమించారు. ఇప్పటి వరకు కేసులో ఎలాంటి పురోగతి లేదని తెలుస్తోంది. అన్నపూర్ణ ఎటు పోయింది.. బతికే ఉందా.. ఉంటే ఎక్కడ ఉంది అనేది ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు సత్యమూర్తి కుటుంబ సభ్యులతో పాటు జిల్లా ప్రజలలో ఆసక్తి రేపుతోంది.

పోలీస్‌స్టేషన్‌లలో నమోదు అవుతున్న మిస్సింగ్‌ కేసులలో చాలా వరకు పరిష్కారం అవుతున్నా..వాటిని స్థానిక పోలీసు అధికారులు వెల్లడించడం లేదు. ఇటీవల బషీరాబాద్‌ మండలం ఎక్మాయి గ్రామానికి చెందిన ఒక యువతి అదృశ్యమైంది. ఈ మేరకు అక్కడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఆతరువాత యువత మరొకరిని వివాహం చేసుకొని తిరిగి వచ్చింది. అక్కడి స్టేషన్‌లో నమోదు అయిన కేసును పోలీసు అధికారులు మూసివేశారు. మిస్సింగ్‌ కేసులలో చాలా వరకు ఇలాంటి కేసులే ఉంటున్నాయని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.

కేసుల చేధనలో పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞానంను పెద్ద ఎత్తున ఉపయోగిస్తోంది. ఇలాంటి తరుణంలో కొన్ని మిస్సింగ్‌ కేసుల ధర్యాప్తులో పురుగతి లేకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. మిస్సింగ్‌ కేసులు స్థానిక పోలీసు అధికారులకు కొంత ఆందోళన కలిగిస్తున్నా.. పని వత్తిడి కారణంగా వాటిపై అధికారులు దృష్టి సారించలేకపోతున్నారు. ఇలాంటి కేసుల ధర్యాప్తుకు ప్రత్యేత యంత్రాంగం ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్రమ సంబంధాలు.. ప్రేమ వ్యవహారం..మతిస్థిమితం లేకపోవడంతోనే మిస్సింగ్‌ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement