Saturday, April 20, 2024

కోవిడ్‌ చికిత్సకు ‘పాఠశాలలు’ !

ప్రభన్యూస్‌ ప్రతినిధి, వికారాబాద్‌: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కొన్ని గ్రామాలలో పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లాలో కరోనా పాజిటివ్‌ రేటు అంతకంతకూ పెరుగుతోంది. కరోనా బాధితులకు చికిత్సలు అందించేందుకు నియోజకవర్గ కేంద్రాలలో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. బాధితులు పెద్ద సంఖ్యలో ఉండడంతో గ్రామాల్లోనే ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించారు. జిల్లా ఇంఛార్జి మంత్రిగా ఉన్న విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చారు కావున గ్రామాల్లోని పాఠశాల భవనాలను కోవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాలుగా వినియోగించుకోవాలని సూచించారు.

జిల్లాలో కోవిడ్‌ పరిస్థితులపై ఇంఛార్జి మంత్రి సబితారెడ్డి సమీక్ష నిర్వహించిన సమయంలో గ్రామాల్లోనే కోవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటుపై చర్చ జరిగింది. మొదటగా నియోజకవర్గ కేంద్రాలలో కోవిడ్‌ చికిత్సలకు ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రామాలలో కోవిడ్‌ బాధితుల సంఖ్య అధికంగా ఉందని వారంతా ఇళ్లలో ఉండే పరిస్థితి లేదని కొందరు ప్రజాప్రతినిధులు మంత్రి సబితారెడ్డి దృష్టికి తీసుకవచ్చారు. గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలను కోవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాలుగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామానికి దూరంగా అన్ని సౌకర్యాలతో ఉన్న పాఠశాలలను కోవిడ్‌ బాధితులను ఉంచేందుకు వినియోగించుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు.

చాలా గ్రామాలలో పదుల సంఖ్యలో కోవిడ్‌ కేసులు ఉన్నాయి. పాజిటివ్‌గా గుర్తించిన వారిలో అధిక శాతం ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత బాధితులు ఇళ్ల వద్దనే ఉంటున్నారు. ఈ కారణంగా గ్రామాలలో కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు గుర్తించారు. గ్రామాలలో చిన్నచిన్న గదులతో నివాసాలు ఉండడంతో వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి పరిస్థితులలో కోవిడ్‌ బాధితులను ఐసోలేషన్‌లో ఉంచాల్సి ఉంటుంది. గ్రామాలలో ఇందుకు అనువైవ పరిస్థితులు లేకపోవడంతో మిన్నకుండిపోయారు. తాజాగా విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలను కోవిడ్‌ ఐసోలేషన్‌కు వినియోగించుకోవాలని సూచించడంతో జిల్లా అధికారులు ఈ దిశగా దృష్టి సారించారు.

దాదాపుగా ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. అన్ని సౌకర్యాలతో కూడిన భవనం..విద్యుత్‌..తాగునీరు లాంటి సౌకర్యాలు ఉన్నాయి. వీటిని ఆయా గ్రామాల్లోని కోవిడ్‌ బాధితుల కొరకు ఐసోలేషన్‌ కేంద్రంగా వాడుకునేందుకు అనువుగా ఉంటుందని జిల్లా అధికారులు భావిస్తున్నారు. జిల్లా మంత్రి సబితారెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ప్రభుత్వ పాఠశాలలను అవసరం ఉన్న ప్రతి గ్రామంలో కోవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాలుగా వినియోగించుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు. మంత్రి ఆదేశాల తరువాత జిల్లాలోని తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీని కోవిడ్‌ పరీక్షల నిమిత్తం వినియోగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement