Saturday, April 20, 2024

ఠాణాకు చేరిన ప్రేమ వ్యవహారం..

వికారాబాద్‌ : వారిద్దరు పదో తరగతి చదువుతున్నారు. ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. పాఠశాలలు లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నారు. ఫోన్‌లో నిత్యం మాట్లాడుకోవడం..చాటింగ్‌ చేయడం చేశారు. అనుకోకుండా ఒకరోజు శారీరకంగా దగ్గర అయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ బంధం కొనసాగింది. కొద్ది రోజులకు బాలిక గర్భం దాల్చింది. వ్యవహారం ఇంట్లో తెలిసిపోయింది. అంతే సీన్‌ అక్కడ కట్‌ చేస్తే పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు ప్రేమికుడిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. గర్భిణీగా ఉన్న బాలిక విషయంలో పోలీసులు పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ పదో తరగతి ప్రేమ వ్యవహారం జిల్లాలోని తాండూరు పోలీసు సబ్‌డివిజన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

జిల్లాలోని తాండూరు ప్రాంతంలో ఉన్న ఒక పాఠశాలకు చెందిన రాజు..అనిత(పేర్లు మార్చడం జరిగింది) పదో తరగతి చదువుతున్నారు. చాలా కాలంగా ఈ ఇద్దరు అదే పాఠశాలలో చదువుకుంటున్నారు. ఒకే తరగతి గదిలో ఉంటే వీరిద్దరి చూపులు కలిశాయి. లేత వయస్సులో మొగ్గ దాల్చిన ఈ ప్రేమ ఎన్నో మలుపులు తిరిగింది. అచ్చంగా సినిమాలలో చూపించే విధంగా వీరి ప్రేమ వ్యవహారం నడిచింది. తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతుంటే ఈ ఇద్దరు మాత్రం ప్రేమ పాఠాలలో మునిగిపోయారు. అంతలోనే కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ ఇద్దరు తమ ఇళ్లకు పరిమితం కావాల్సి వచ్చింది. ఇంటికి పరిమితం అయినా ప్రేమ వ్యవహారంను సెల్‌ఫోన్‌లో కొనసాగించారు.

అలాఅలా సాగిన ప్రేమలో అనుకోని కుదుపు వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఇద్దరు ప్రేమికులు మరింత సన్నిహితంగా గడిపారు. శారీరకంగా దగ్గర కావడంతో వారి ప్రేమ కళ్లుమూసుకుంది. ఇద్దరి మధ్య ఈ బంధం కొనసాగింది. అంతే కొద్ది మాసాలకు బాలిక గర్భందాల్చింది. బాలిక ప్రవర్తనలో మార్పును గుర్తించిన తల్లిదండ్రులు నిలదీశారు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా క్షణం ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకున్నారు. బాలికను గర్భవతిగా చేసిన బాలుడిని అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు జైలు ఊసలు లెక్కిస్తున్నాడు.

ఇక గర్భం దాల్చిన బాలిక పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. పోలీసులు మాత్రం ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేసి బాలుడిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. మరి గర్భిణీగా ఉన్న బాలిక పరిస్థితి ఏమిటి అనేది అంతుచిక్కడం లేదు. ఇలాంటి కేసులలో బాలికకు ఎలా న్యాయం చేయాలి అనేదానిపై పోలీసులు అంతర్మథనం సాగిస్తున్నారు. విషయాన్ని జిల్లా చైల్డ్‌ వెల్పేర్‌ కమిటి దృష్టికి పోలీసులు తీసుకపోయారు. బలవంతంగా గర్భంను తొలగించడానికి చట్టం అంగీకరించదు..అలాగే వదిలేస్తే బాలిక జీవితం పూర్తిగా నాశనం అవుతుందని పోలీసులు తలపట్టుకుంటున్నారు. జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటి ఈ కేసులను పరిశీలించి తక్షణమే బాలిక గర్భంను తొలగించాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు వివరించారు. బాలిక తల్లిదండ్రుల నుంచి స్పందన కనిపించడం లేదు. బాధిత కుటుంబ సభ్యులను ఎలాగైనా ఒప్పించి గర్భ విచ్ఛినం చేయించాలనే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement