Thursday, April 25, 2024

కొత్తూరు మున్సిపాలిటీ టిఆర్ఎస్ దే ..మంత్రి

షాద్ నగర్: ఒకప్పుడు కొత్తూరులో ఐదారు పార్టీలు కనిపించేవి ఇప్పుడు అన్ని పార్టీలు ఖతం అయ్యాయి.. అందరూ గులాబీ జెండా కిందకే వస్తున్నారు. టిఆర్ఎస్ కి ఇక ఎదురేలేదు అంటూ ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలోని పేపర్ స్పోర్టులో స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కొత్తూరు టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఖమ్మం, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లు టిఆర్ఎస్ ఖాతాలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కొత్తూరులో జరిగిన మంత్రి కేటీఆర్ సభ సందర్భంగా ప్రజల అభీష్టానికి విలువ ఇస్తూ అభివృద్ధి నిధులు కేటాయించామన్నారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీతో అన్ని పార్టీలలోని కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్ లోకి వస్తున్నారని చెప్పారు. టిఆర్ఎస్ అభివృద్ధి చూసి నేడు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు మరెందరో పార్టీలో చేరుతున్నారని తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలలో వివిధ హోదాలలో పని చేస్తున్నవారు ఈరోజు టీఆర్ఎస్ వైపు వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కొత్తూరులో ప్రజానాడి తెలిసిపోయిందని కొత్తూరు మున్సిపాలిటీ ఇక టిఆర్ఎస్ పార్టీదేనని అన్నారు.

అభివృద్ధికి ఆకర్షితులవుతున్నారు – ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

కొత్తూరు లో జరుగుతున్న అభివృద్ధికి ఆయా పార్టీల నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు కళ్లారా చూసి ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఆయన విశదీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, సీనియర్ నేత వంకాయల నారాయణరెడ్డి, ఏనుగు జనార్దన్ రెడ్డి, సత్యనారాయణ, పెంటనోళ్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement