Tuesday, March 26, 2024

ప్రారంభానికి నోచుకోని ఆసుపత్రులు..

వికారాబాద్‌ : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందనట్టుగా ఉందీ ఈ ఆసుపత్రుల పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని వికారాబాద్‌..తాండూరు..పరిగి ప్రాంతాలలో మూడు భారీ ఆసుపత్రి భవనాలను ప్రభుత్వం నిర్మించింది. ఈ భవనాల నిర్మాణం పూర్తి చేసి దాదాపు రెండేళ్లు గడుస్తోంది. వీటిని ప్రారంభించడానికి ప్రభుత్వంలోని పెద్దల కొరకు ఎదురుచూస్తున్నారు. అదిగో..ఇదిగో అంటూ పెద్దలు సమయం ఇవ్వడం లేదు. ఏళ్లుగా కొత్త భవనాలకు తాళం వేసి ఉంచుతున్నారు. మరోవైపు కోవిడ్‌ బాధితులు పడకలు దొరక్క అల్లాడిపోతున్నారు. ఇప్పుడైనా ఎవరో ఒకరు వచ్చి జిల్లాలో ప్రారంభానికి ఎదురుచూస్తున్న మూడు ఆసుపత్రులను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

వైద్య విధాన పరిషత్‌కు జిల్లాలో పటిష్టమైన నెట్‌వర్క్‌ ఉంది. జిల్లాలోని తాండూరులో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సేవలు అందిస్తోంది. జిల్లా కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రం ఉంది. పరిగిలో కూడా సామాజిక ఆరోగ్య కేంద్రం ఉంది. మర్పల్లిలో కూడా సివిల్‌ ఆసుపత్రి సేవలు అందిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది. దీంతో జిల్లాలోని తాండూరుకు మాతాశిశు ఆసుపత్రిని మంజూరు చేసింది. దాదాపు రూ.16 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. మాతాశిశు ఆసుపత్రి నిర్మాణంను మొత్తంగా పూర్తి చేశారు. వికారాబాద్‌లో వంద పడకలతో కొత్తగా మరో ఆసుపత్రిని నిర్మించారు. పరిగిలో కూడా వంద పడకలతో ఆసుపత్రిని నిర్మించారు. ఈ మూడు ప్రాంతాలకు మంజూరు చేసిన నూతన ఆసుపత్రి భవనాల నిర్మాణంను దాదాపు రెండేళ్ల క్రితమే పూర్తి చేశారు.

తాండూరులో నిర్మించిన మాతాశిశు ఆసుపత్రి భవనంను ప్రారంభించేందుకు ఇప్పటికే రెండు మార్లు ప్రయత్నించారు. వేసిన రంగు పాతబడడంతో రెండు సార్లు భవనంకు రంగులు వేశారు. అయినా ప్రారంభానికి నోచుకోలేదు. ఈ ఆసుపత్రిలో భారీ ఆక్సిజన్‌ ట్యాంకును కూడా ఏర్పాటు చేసి వెంటిలేటర్‌ సదుపాయాన్ని కల్పించారు. మాతాశిశు ఆసుపత్రిలో పనిచేసేందుకు పెద్ద సంఖ్యలో సిబ్బందిని..వైద్యులను కూడా నియమించారు. వారంతా కూడా రెండేళ్లుగా విధులలో ఉంటూ జీతాలు తీసుకుంటున్నారు. నేటికీ భవనంను ప్రారంభించలేదు. ఇక వికారాబాద్‌లో కూడా పూర్తి అయిన వంద పడకల ఆసుపత్రిది కూడా అదే కథ. పరిగిలోని ఆసుపత్రిని ప్రారంభించినా అందులో అడుగు పెట్టలేని పరిస్థితి.

ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. స్థానికంగా పూర్తిస్థాయి వైద్యం అందక హైదరాబాద్‌కు పరుగులు తీస్తున్నారు. అక్కడ ప్రభుత్వ..ప్రైవేటు ఆసుపత్రులలో పడకలు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. కొందరు ఆరుబయిట ఉంటున్నారు. మరికొందరు అంబులెన్స్‌లలో ఇంటూ చికిత్సలు పొందుతున్నారు. ఇక విధిలేక కొందరు బాధితులు ఇంటిదారి పడుతున్నారు. స్థానికంగా అధునాతన వసతులతో నిర్మించిన ఆసుపత్రులను ఎవరో ఒకరు ప్రభుత్వ పెద్దలు వచ్చి ప్రారంభిస్తే గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద రోగులకు మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూర్తి చేసుకున్న నూతన ప్రభుత్వ ఆసుపత్రుల భవనాలను ప్రారంభించడానికి ప్రభుత్వ పెద్దలు ఎవరు వస్తారో వేచిచూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement