Thursday, April 18, 2024

కోవిడ్‌ పరీక్షలకు పరుగోపరుగు.. !

వికారాబాద్‌ : కరోనా పరీక్షల కొరకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు కిక్కిరిసి కనిపిస్తున్నారు. పట్టణాలు..గ్రామాలలో కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో ఒక్కసారిగా పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఈ పరిస్థితిని గుర్తించిన అధికారులు జిల్లాలోని అన్ని కేంద్రాలలో పరీక్షల సంఖ్యను భారీగా పెంచారు. కొందరు ముందుజాగ్రత్తగా పరీక్షలు చేయించుకుంటున్నారు. మరికొందరు జలుబు..దగ్గు ఉంటే కూడా పరీక్షలకు పరుగులు తీస్తున్నారు. కోవిడ్‌ భయం ప్రజలను ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రజలలో ఆందోళన కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతున్న కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్నటి వరకు గ్రామానికి ఒకటి..రెండు కేసులు వస్తే వార్తల్లో ఉండేది. ప్రస్తుతం ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబాలు..కుటుంబాలు మొత్తం కరోనా బారిన పడుతోంది. నిన్నటి వరకు కలిసి ఉన్న వ్యక్తులు అంతలోనే కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రజలు షాక్‌కు గురి అవుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా పెద్ద సంఖ్యలో ప్రజలు కోవిడ్‌ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు.

ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు..ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేవలం అరగంటలోనే ఫలితం వస్తోంది. కోవిడ్‌ రెండో దశ ప్రారంభంకు ముందు జిల్లాలో ప్రతిరోజు 500 వరకు కోవిడ్‌ పరీక్షలు చేస్తూ వచ్చారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రారంభం అయిన తరువాత జిల్లాలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. అదే సమయంలో పరీక్షల సంఖ్యను కూడా పెంచారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పరీక్ష కేంద్రాలకు వస్తున్న కారణంగా అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజు దాదాపు 3 వేల వరకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు గ్రామీణ ప్రాంతాల్లోనే ఒక్కో కేంద్రంలో వంద వరకు పరీక్షలు చేస్తున్నారు. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన గ్రామాలలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దకు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పరీక్షల కొరకు తరలివస్తున్నారు.

జిల్లాలో రోజువారిగా కోవిడ్‌ పరీక్షల సంఖ్య భారీగా పెరగడంపై వైద్య శాఖ అధికారులు స్పందిస్తూ.. ముందు జాగ్రత్తగా ప్రజలు పరీక్షలు చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇరుగు పొరుగు వారికి లేదా తెలిసిన వారికి లేదంటే ఒకటి రెండు రోజుల ముందు కలిసిన వారికి పాజిటివ్‌ వచ్చి ఉంటే వెంటనే వారంతా పరీక్షలకు వస్తున్నారని పేర్కొంటున్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడే పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు. కొందరు కోవిడ్‌ లక్షణాలు లేకపోయినా పదేపదే పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇలాంటి వారు భయం..ఆందోళనతో పరీక్షలకు పరుగులు తీస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జిల్లాలో కోవిడ్‌ పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు పరీక్ష కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement