Tuesday, April 23, 2024

కోవిడ్‌ మృతులకు అంత్యక్రియలు..అర్దరాత్రి పిలిచినా సేవలకు సిద్దం..

కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న విలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిరోజు అనేక మంది ఈ వైరస్‌ సోకి మరణిస్తున్నారు. ఒకే ఇంటిలో ఇద్దరు..ముగ్గురు మరణిస్తున్నారు. కరోనాతో మరణిస్తున్న వారి వద్దకు వెళ్లడానికి కుటుంబ సభ్యులు కూడా భయపడుతున్నారు. ఆసుపత్రులలోనే మృతదేహాలను వదిలిపెట్టి ఇంటికి వస్తున్నారు. వైరస్‌ సోకి చికిత్స పొందుతున్న వారి వద్దకు కూడా వెళ్లడానికి కుటుంబ సభ్యులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేసే వారు లేక శవాగారం(మార్చురీ)లో కుప్పలుగా పడి ఉన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో జిల్లాలోని తాండూరుకు చెందిన కొందరు మైనార్టీ యువకులు సాహసోపేత సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోవిడ్‌ మృతులకు అంత్యక్రియలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.

అన్ని లాంఛనాలతో అంత్యక్రియలు..
తాండూరుకు చెందిన సయ్యద్‌ కమాల్‌ అక్తర్‌, సోహెల్‌ ఆహ్మద్‌ ఉమ్రి, నజీర్‌ ఆహ్మద్‌, అజర్‌ ఆహ్మద్‌, సాకిబ్‌ మీర్‌, సాజిద్‌ పటేల్‌, అబ్దుల్‌ మన్నాన్‌లు బృందంగా మారి కోవిడ్‌ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది కోవిడ్‌ సమయంలో ప్రారంభించిన ఈ సేవలను నేటికీ కొనసాగిస్తున్నారు. ఇటీవల వారం రోజుల వ్యవధిలో తాండూరు ప్రాంతంలో ఐదు మంది కోవిడ్‌ మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు అయ్యే మొత్తం ఖర్చును బృందం సభ్యులు భరిస్తున్నారు. జెసిబి యంత్రంతో గోతులను తీయించి..కొత్తగా వస్త్రంను తీసుకువచ్చి అందులో మృతదేహంను చుట్టి..ప్రత్యేక అంబులెన్స్‌ వాహనంతో స్మశానంను తరలించి అంత్యక్రియలు జరుపుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఏఒక్కరు కూడా వీరి వెంట ఉండడం లేదు. అర్దరాత్రి సమాచారం ఇచ్చినా సరే వెంటనే మైనార్టీ యువకులు స్పందించి సేవా కార్యక్రమంలో మునిగిపోతున్నారు. ఇటీవల వరకు తాండూరు పట్టణంలో మరణించిన వారికి మాత్రమే అంత్యక్రియలు నిర్వహించగా గత వారం రోజులుగా గ్రామీణ ప్రాంతాలలో మరణించిన కోవిడ్‌ మృతులకు సైతం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు

మతాలకు అతీతంగా సేవలు..
ఈ బృందం సభ్యులు మతాలు..కులాలకు అతీతంగా తమ సేవలను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 45 మంది మైనార్టీలు.. 25 మంది హిందూ మతానికి చెందిన కోవిడ్‌ మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. ఎవరు పిలిచినా వెళ్లి కోవిడ్‌ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ బాధితుల వద్దకు వెళ్లడానికే భయపడుతున్న పరిస్థితులలో కోవిడ్‌తో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు వచ్చిన యువకుల బృందంను అన్ని వర్గాల వారు ప్రశంసిస్తున్నారు. తాండూరు ప్రాంతంలో ఈ సేవలు పొందాలనుకునేవారు ఫోన్‌ నెంబర్‌ 9398899403(కమాల్‌ అక్తర్‌), 7981546586(మౌలానా సోహెల్‌ ఆహ్మద్‌ ఉమ్రి)లను సంప్రదించాలి. తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని పణంగా పెట్టి మరీ కోవిడ్‌ మృతులకు తాము ఉన్నామంటూ అన్ని లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న మైనార్టీ యూత్‌ వెల్ఫేర్‌(తాండూరు) సభ్యులకు ఆంధ్రప్రభ సలాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement