Thursday, April 25, 2024

కారు బీభత్సం : ఇద్ద‌రికి గాయాలు

తాండూరు : మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కారును వేగంగా నడిపిస్తూ బట్టల షాప్ లోకి దూసుకెళ్లాడు. శనివారం సాయంత్రం తాండూరు పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ సమీపంలో నివాసముంటున్న నారాయణ అనే వ్యక్తి సాయంత్రం ఆల్టో కార్ లో మున్సిఫ్ కోర్టు రోడ్డు మార్గం నుంచి అంబేద్కర్ చౌరస్తా వైపు వస్తున్నాడు. మార్గమధ్యలోని చైతన్య కళాశాల దాటిన తర్వాత కారును వేగంగా నడిపిస్తూ మలుపు వద్ద కారు అదుపు తప్పడంతో ఎదురుగా ఉన్న క్రేజీ బట్టల షాప్ లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో కారు నడిపిస్తున్న నారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే కారులో ఉన్న వైద్యనాథ్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. కారు దూసుకొస్తున్న క్రమంలో బట్టల షాప్ లో ఉన్నకొందరు యువకులు గమనించి ముందుకు జరగడంతో వారికి ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన డ్రైవర్ ను, మ‌రో వ్యక్తిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తలకు గాయాలై నారాయణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కార్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నకారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement