Thursday, April 25, 2024

అంతర్‌ రాష్ట్ర రోడ్డుకు మహర్దశ..


వికారాబాద్‌ : రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తున్న అంతర్‌రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి స్వయంగా వెల్లడించారు. దాదాపు వంద కిలోమీటర్ల నిడివితో ఉన్న ఈ రహదారిని భారత్‌మాల పరియోజన పథకం కింద చేర్చి అభివృద్ధి చేస్తామని కేంద్రం వెల్లడించింది. కేంద్ర ప్రకటనతో పాలమూరు రోడ్డుకు మహర్దశ వచ్చిదని పేర్కొనవచ్చు.

అటు బెంగళూరు జాతీయ రహదారి..ఇటు ముంబాయి జాతీయ రహదారిని అనుసంధానం చేస్తున్న మహబూబ్‌నగర్‌..కోడంగల్‌..తాండూరు..చించోలి అంతర్‌రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలనే డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. నాలుగేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ రహదారి అభివృద్ధిని భారత్‌మాల పరియోజన కింద చేర్చింది. ఆతరువాత కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు కొంత దెబ్బతినడంతో ఈ రహదారి ప్రస్తావన లేకుండా పోయింది. తాజాగా ఈ రహదారిని అభివృద్ధి చేయాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ టిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొద్ది రోజుల క్రితమే కలిశారు. భారత్‌మాల పరియోజన కింద ఈ రహదారిని అభివృద్ధి చేసే విధంగా కేంద్రంను ఒప్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సరిగ్గే అదే సమయంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి ప్రకటన వచ్చింది.

ప్రమాదాలకు నిలయంగా రోడ్డు

మహబూబ్‌నగర్‌ నుంచి చించోలి వరకు ఉన్న రహదారి అత్యంత అధ్వాన్నంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణం అంటే సాహసం చేయాల్సి వస్తోంది. నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రహదారి వెళుతున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రోడ్డు దుస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కేంద్ర ప్రకటన రావడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి ప్రారంభం అయ్యే ఈ రహదారి కోడంగల్‌..తాండూరు నియోజకవర్గాల మీదుగా కర్ణాటకలోని చించోలి వరకు వెళుతుంది. చించోలి నుంచి మన్నెకెలి వరకు ఉన్న రోడ్డు మార్గంను అభివృద్ధి చేశారు. మిగిలిపోయిన దాదాపు 108 కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధి చేయాల్సి ఉంది

డిపిఆర్‌..భూసేకరణ రాష్ట్ర బాధ్యత
కేంద్రం ఈ అంతర్‌రాష్ట్ర రహదారిని అభివృద్ధి చేసేందుకు ముందుకు రావడంతో ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌మాల పరియోజన కింద చేర్చి అభివృద్ధి చేస్తామని కేంద్రం పేర్కొంది. ఈ రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ది చేస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ గెజిట్‌లో పేర్కొని ఒక సంఖ్య(జాతీయ రహదారి నెంబర్‌)ను కేటాయించాల్సి ఉంటుంది. ఆతరువాత రోడ్డు అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్‌)ను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంను కోరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా డిపిఆర్‌ ఇస్తే అంతే వేగంగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే డిపిఆర్‌లో ఎంత మేరకు భూసేకరణ చేయాలి అనేది స్పష్టమవుతుంది. రోడ్డు విస్తరణకు అవసరం అయ్యే భూసేకరణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. అందుకు నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణకు అడ్డుగా వచ్చే విద్యుత్‌ లైన్‌లను.. భూమి కింద ఉండే నీటి పైప్‌లైన్‌లను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చులతో తొలగించి మరో చోట వేయాల్సి ఉంటుంది. ఆతరువాత కేంద్ర ప్రభుత్వం రోడ్డు విస్తరణ..అభివృద్ధి కొరకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. రోడ్డు అభివృద్ధి..విస్తరణకు కేంద్రం పైసా కూడా ఖర్చు చేయదు. ఈ రోడ్డు అభివృద్ధిని యాన్యూనిటి(ప్రైవేటు వ్యక్తులు నిధులను వ్యయం చేసి టోల్‌ ద్వారా వసూలు చేసుకునే విధానం) విధానంను అనుసరిస్తుంది.

మన్నెగూడ రోడ్డు అభివృద్ధి ఎప్పుడో ?
———————————————
కేంద్ర ప్రభుత్వం పోలీసు అకాడమి నుంచి మన్నెగూడ వరకు ఉన్న రోడ్డును కూడా భారత్‌మాల పరియోజన కింద అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్‌ను సిద్దం చేసి భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. విద్యుత్‌ లైన్లు..తాగునీటి పైప్‌లైన్‌లను షిఫ్టింగ్‌ చేసేందుకు సిద్దమైంది. కేంద్రం కూడా రోడ్డు విస్తరణ..అభివృద్ధికి టెండర్‌ ప్రక్రియ చేపట్టింది. అంతలోనే టెండర్లను కేంద్రం రద్దు చేసింది. ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంకు లేఖలు రాశారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరిని కలిశారు. ఆయన మంత్రిత్వ శాఖ అధికారులను కలిశారు. పార్లమెంటులో కూడా ప్రస్తావించారు. అయినా కేంద్రం నుంచి స్పందన లేదు. ఇలాంటి పరిస్థితి మహబూబ్‌నగర్‌..చించోలి అంతర్‌రాష్ట్ర రహదారికి వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రహదారిని కేంద్రం అభివృద్ధి చేస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం వదిలేస్తే ప్రస్తుతం అధ్వాన్న స్థితికి చేరుకున్న రోడ్డు ఈ వర్షాకాలం తరువాత రోడ్డు అనవాళ్లు కూడా కనిపించకుండాపోయే అవకాశం లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement