Thursday, April 25, 2024

ఆంధ్రప్రభతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మురళీక్రిష్ణగౌడ్..

విభిన్నంగా ముందుకు సాగుతాం !
సంస్థలో రూ.12 కోట్ల నిధులు
గ్రంథాలయాల పటిష్టంకు ప్రాధాన్యం
ఆతరువాత కొత్త వాటిపై దృష్టి
‌వికారాబాద్‌ : ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా గ్రంథాలయాలను పటిష్టం చేయడంపై దృష్టి సారిస్తాం..మొదటగా ఉన్న గ్రంథాలయాలపై దృష్టి సారిస్తాం..ఆతరువాత కొత్త శాఖలను ఏర్పాటు చేయడంపై ఆలోచన చేస్తాం..సంస్థకు నిధుల కొరత లేదు..ఉమ్మడి జిల్లా నుంచి విభజన తరువాత పెద్ద ఎత్తున నిధులు వచ్చాయిని జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్‌ మురళీక్రిష్ణగౌడ్‌ తెలిపారు. ఆయన ఆంద్రప్రభతో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఆంధ్రప్రభ: మీ నియామకంపై వివాదం ఏమిటి ?
మురళీ: ఎలాంటి వివాదం లేదు. జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు అనుకూలంగా లేఖలు ఇచ్చారు. నామినేటెడ్‌ పదవుల కొరకు అగ్రనేతలపై తీవ్ర వత్తిడి ఉంది. ఇలాంటి సందర్భాలలో కొంత అసంతృప్తి ఉంటుంది. అంతకు మించి వివాదం లేదు.
ఆంధ్రప్రభ: గ్రంథాలయాలపై మీకున్న అవగాహన ?
మురళీ: యంగ్‌ లీడర్స్‌ సంస్థ ఆధ్వర్యంలో చాలా గ్రామాలలో విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంత ప్రజలు..యువకులకు విజ్ఞాన కేంద్రాలు చాలా ఉపయోగపడ్డాయి.
ఆంధ్రప్రభ: జిల్లాలో గ్రంథాలయాల పరిస్థితి ఏమిటి ?
మురళీ: జిల్లాలో ప్రస్తుతం 17 వరకు గ్రంథాలయాల శాఖలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో సెంట్రల్‌ లైబ్రరి ఉంది.
ఆంధ్రప్రభ: జిల్లాలో గ్రామీణ గ్రంథాలయాలు ఎన్ని?
మురళీ: ప్రస్తుతం జిల్లాలో కేవలం రెండు గ్రామ గ్రంథాలయాలు మాత్రమే ఉన్నాయి.
ఆంధ్రప్రభ: గ్రంథాలయాలను విస్తరించే అవకాశం ఉందా ?
మురళీ: ముందుగా ఉన్న గ్రంథాలయాలను పటిష్టం చేస్తాం. గ్రంథాలయ భవనాల నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. వాటిని పూర్తి చేయిస్తాం. మారిన పరిస్థితులకు అనుగుణంగా గ్రంథాలయాలలో సౌకర్యాలను మెరుగుపరుస్తాం. ఆతరువాత కొత్త శాఖల ఏర్పాటుపై దృష్టి సారిస్తాం.
ఆంధ్రప్రభ: సంస్థకు నిధుల లభ్యత ఎలా ఉంది ?
మురళీ: సంస్థకు నిధుల కొరత ఏమీ లేదు. ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన సమయంలో జిల్లాకు దాదాపు రూ.12 కోట్ల నిధులు వచ్చాయి.
ఆంధ్రప్రభ: ఇటీవల బడ్జెట్‌ ఏమైనా ప్రవేశపెట్టారా |
మురళీ: గత చైర్మన్‌ హయాంలో గ్రంథాలయ సంస్థ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.7.31 కోట్లతో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం లభించింది.
ఆంధ్రప్రభ: సంస్థలో డైరెక్టర్‌ల నియామకం ఎప్పుడు ?
మురళీ: సంస్థలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరిలో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారు. మిగితా డైరెక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆంధ్రప్రభ: ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారు ?
మురళీ: మొత్తం ఆరుగురు డైరెక్టర్లలో ముగ్గురు ప్రజల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇద్దరు మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులకు అవకాశం ఉంటుంది. ఒకరు మునిసిపల్‌ కౌన్సిలర్‌కు అవకాశం కల్పిస్తారు. జిల్లాలోని ఎమ్మెల్యేలను సంప్రదించి డైరెక్టర్లను నియమించాల్సి ఉంది.
ఆంధ్రప్రభ: బాధ్యతలు చేపట్టారా..ప్రమాణస్వీకారం ఎప్పుడు ?
మురళీ: సంస్థ చైర్మన్‌గా బాధ్యతలను చేపట్టడం జరిగింది. అయితే ఇంకా ప్రమాణస్వీకారం చేయలేదు. కోవిడ్‌ ఆంక్షలు అమలులో ఉన్నాయి. కావున మంత్రి సబితారెడ్డి.. జిల్లా ఎమ్మెల్యేలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement