Sunday, March 24, 2024

మరియమ్మ లాక్అప్ డెత్‌ కేసు.. ముగ్గురు పోలీసులపై వేటు

తెలంగాణలో సంచలనం సృష్టించిన మరియమ్మ లాక్‌అప్ డెత్ కేసులో బాధ్యులపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ చర్యలు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను తమ సర్వీసు నుండి సీపీ తొలగించారు. ఎస్ఐ మహేశ్వర్, కానిస్టేబుళ్లు రషీద్ పటేల్, జనయ్యలను సర్వీసు నుంచి తొలగిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఆర్టికల్ 311 (2) బి 25 (2) ప్రకారం బాధ్యులను సీపీ సర్వీసు నుండి తొలగించారు. 

కాగా, అడ్డగుడూరు పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీలో మరియమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే.  ఖమ్మం జిల్లా కోమట్లగూడెం గ్రామానికి చెందిన మరియమ్మ… యాదాద్రి భువనగిరి జిల్లాలోని చర్చిలో పనిచేసేది. ఈ క్రమంలో చర్చిలో డబ్బులు పోయాయని ఫాదర్ ఫిర్యాదు చేయడంతో… జూన్ 18న మరియమ్మతో పాటు ఆమె కొడుకు ఉదయ్, అతని స్నేహితుడు శంకర్ ను అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీసులు. విచారణ సమయంలో కొట్టడంతో మరియమ్మ చనిపోయింది. ఉదయ్ ఆస్పత్రి పాలయ్యాడు. 

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. గాంధీ భవన్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతేకాదు సీఎం కేసీఆర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు కేసీఆర్ కి వ్యతిరేకంగా ధర్నాలు చేశాయి. ఈ నేపథ్యంలో పోలీసుల శాఖ బాద్యులపై చర్యలు తీసుకుంది.  అయితే తాజాగా ఈ వ్యవహారంలో ఎస్ఐ మహేశ్వర్, కానిస్టేబుళ్లు రషీద్, జనయ్యలను సర్వీసు నుంచి తొలగిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement