Friday, April 19, 2024

‘ఉద్యానాని’కి ప్రాధాన్యం.. 59 లక్షల టన్నులకు చేరిన దిగుబడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ప్రాధాన్యత రంగాల్లో భాగంగా ఉద్యానవన రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఉద్యానవన రంగంలో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించే క్రమంలో డ్రిప్‌, స్ప్రింక్లర్‌లకు 2014 నుంచి రూ.2048.93 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి నీటి బొట్టును గరిష్ట స్థాయిలో సద్వినియోగపరచడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు కదులుతోంది. కూరగాయాలు, ఆయిల్‌పామ్‌ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యం దిశగా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2 కోట్ల 14 లక్షల ఎకరా లు సాగవుతున్నది. దానిలో 5.39 శాతం భూమి అంటే 11.57 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగవుతున్నవి. వీటిలో ఉద్యానవన పంటల దిగుబడి 59 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉంది. ఈ ఉత్పత్తి ద్వారా వ్యవసాయ రంగ ఆదాయ వాటాలో 27 శాతం ఉద్యానరంగం నుంచి వస్తుండడం విశేషం. ఉద్యానవన పంటల్లో వెజిటబుల్స్‌ 2.23 లక్షల ఎకరాలు, పండ్లు 4.24 లక్షల ఎకరాలు, సుగంధ ద్రవ్యాలు 3.56 లక్షల ఎకరాలు, ప్లాంటేషన్స్‌ 55 వేల ఎకరాలు , పూలు 9 వేల ఎకరాలలో సాగవుతున్నవి. వీటితో పాటు కొద్ది ఎకరాల్లో మెడిసినల్‌, అలంకరణ మొక్కల నర్సరీలు ఉన్నాయి. 86 వేల ఎకరాల్లో ఆగ్రో ఫారెస్ట్రీ,3 వేల ఎకరాల్లో సెరికల్చర్‌ నర్సరీలు పెంచుతున్నారు. తెలంగాణ రాష్ట్రం పసుపు పంట సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. మిరప సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్నది. అలాగే ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణంలో 6 వ స్థానంలోను, ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉన్న వాతావరణం, భూసార పరిస్థితులు, మెరుగైన యాజమాన్య పద్ధతులు వలన గెలల నుంచి వస్తున్న ఆయిల్‌ ఫామ్‌ రేషియో దేశంలోనే అత్యధికంగా 19.22గా ఉంది.

రాష్ట్ర సాగు విస్తీర్ణంలో హార్టికల్చర్‌ విస్తీర్ణం 5.39 శాతం మాత్రమే ఉన్నప్పటికీ మొత్తం వ్యవసాయరంగమునకు 27 శాతం ఆదాయం జమచేస్తోంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విధంగా ఉద్యానవన పంటల వైపు రైతులు మళ్ళుతున్నారు. ఉద్యనవనాల సాగు పెంపకం పట్ల రైతులను ప్రోత్సాహించేందుకుగాను 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. సబ్సిడీ ద్వారా రూ.295 కోట్లతో 1,324 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్రీన్‌ పాలి హౌస్‌లతో 1,190 మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో అదనంగా 27,376 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు పెరిగింది. దీంతో ప్రస్తుతం ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తీర్ణం 68,440 ఎకరాలకు చేరింది. ఆయిల్‌ పామ్‌ గెలల ఉత్పత్తి 2.6 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అవుతోంది. సాగునీటి వసతి పెరుగుటతో రాష్ట్రంలో 9.49 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ ఫామ్‌ సాగును విస్తరించవచ్చని కేంద్రం నోటిఫై చేసింది. అయితే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సాహించుటలో భాగంగా రాబోయే 5 ఏండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగును విస్తరించుటకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. స్టేట్‌ ప్లాన్‌ బడ్జెట్‌లో భాగంగా 2022-23 లో ఆయిల్‌ పామ్‌కు ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. పండ్లు, కూరగాయలు, పూలు, ఆగ్రో ఫారెస్ట్రీ సాగులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం,పద్ధతుల పట్ల రైతులకు శిక్షణ ఇచ్చే ప్రదర్శన క్షేత్రాలుగా ఉపయోగపడే రెండు ఎక్సలెంట్‌ సెంటర్లను మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల, సిద్ధిపేట జిల్లా ములుగు లలో ప్రభుత్వం నెలకొల్పింది. రూ.45.43 కోట్ల వ్యయంతో 4,552 ఎకరాల్లో వేసిన కూరగాయల పందిళ్లతో 3,936 మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. 2021-22లో రూ.166 కోట్ల వ్యయంతో 83,240 ఎకరాలను మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోకి వచ్చింది. తద్వారా 31,084 మంది రైతులు లబ్ధిపొందుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement