Friday, April 19, 2024

Big Story: అటవీ భూముల సమగ్ర సర్వేకు స‌న్నాహాలు.. 25లక్షల ఎకరాల్లో రీ సర్వే

ప్రభుత్వ భూములు, ఆస్తులను పరిరక్షిస్తున్న తెలంగాణ ప్రభుత్వం త్వరలో భారీ కార్యాచరణను పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించింది. అటవీ భూముల సమగ్ర సర్వేతో ఆయా భూముల సమస్యలు త్వరలో పరిష్కరించేందుకు ముహూర్తం సిద్ధం చేస్తున్నది. తద్వారా విలువైన అటవీ భూముల లెక్క తేల్చి ప్రభుత్వ ఖాతాలో నిక్షిప్తం చేసేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ భూముల సరిహద్దుల సమస్యలకు ముగింపు పలికి, పక్కా హద్దులను రికార్డుల్లో చేర్చేందుకు రెడీ అవుతున్నది.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని అటవీ, రెవెన్యూ భూముల మధ్య సరిహద్దుల సర్వేకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలో అటవీ సరిహద్దు సమస్యలకు మంగళం పాడేలా మరో సర్వేకు తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక అడుగులు వేయనున్నది. ఇంటిగ్రేటెడ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌) పోర్టల్‌లో వివాదాల్లేని భూములను నమోదు చేసిన తర్వాత ధరణిలో పూర్తిగా ప్రైవేటు భూముల వివరాలు నమోదయ్యాయి. అయితే అటవీ భూములకు కూడా సర్వే నెంబర్లు వేసి పక్కాగా రికార్డులు సిద్దం చేయాలన్న సర్కార్‌ ఆదేశాలకనుగుణంగా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తున్నది. సర్వే నెంబర్లు లేని భూములకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా నెంబర్లను కేటాయించనున్నారు.

ఒక్కో జిల్లాలో ఒకలా…
ఇలా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివరాలను సేకరించారు. నల్గొండలో 33212.11 ఎకరాలు, భూపాలపల్లిలో 26,507 ఎకరాలు, కుమరం భీం జిల్లాలో 21,753ఎకరాలు, మంచిర్యాలలో 20,155 ఎకరాలు, మెదక్‌ జిల్లాలో 17,947 ఎకరాలు, వికారాబాద్‌లో 16,319 ఎకరాలు, కామారెడ్డిలో 15730 ఎకరాలు, నిజామాబాద్‌లో 12689 ఎకరాలలు, మహబూబాబాద్‌లో 12644 ఎకరాల భూముల్లో సరిహద్దు సమస్యలు ఉన్నట్లుగా గుర్తించారు. 30 జిల్లాల్లో 2,18,980 ఎకరాల భూముల్లో సరిహద్దు వివాదాలు రెవెన్యూ, అటవీ శాఖల నడుమ పేరుకుపోయాయని గుర్తించారు. 2017లో జరిగిన భూ రికార్డుల ప్రక్షాళనలో 41.74 లక్షల ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు గుర్తించగా, సరిహద్దు వివాదాలు భారీగా పరిష్కరించాల్సి ఉందని ఆ తర్వాత వెల్లడైంది.

అన్ని సమస్యలూ దూరం…
ప్రభుత్వ శాఖల మధ్య సరిహద్దు సమస్యలు లేకుండా చూడాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అధికారులు కీలక చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. సరిహద్దు సమస్యలు, ఆక్రమణల నివారణకు రెవెన్యూ, అటవీ అధికారులతో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలను గతంలోనే ఏర్పాటు చేశారు. ఫారెస్ట్‌ భూముల పరిరక్షణకు ఉమ్మడి రాష్ట్రంలో జాయింట్‌ సర్వేకు సీఎం కేసీఆర్‌ ఆదేశించనున్నారని తెలిసింది. ఇప్పుడు ఆయా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అటవీ సరిహద్దు సమస్యలు రైతులకు శాపంగా మారాయి. రెండు శాఖలు సంయుక్తంగా సమన్వయంతో చేపట్టే జాయింట్‌ సర్వేద్వారా ఆదివాసీల సమస్య కూడా కొలిక్కి రానుంది. 6లక్షల ఎకరాల్లో గిరిజనులు, ఆదివాసీలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారని, వాటిపై తమకు పట్టాలు ఇవ్వాలని షెడ్యూల్‌ తెగలు, ఇతర ఆదివాసీలు అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 కింద లక్షా 83వేలకుపైగా దరఖాస్తులు ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో ఆదివాసీలతోపాటు ఇతరులు కూడా ఉన్నారు. అయితే 93,639 మంది ఆదివాసీలకు 3,00,284 ఎకరాల భూములకు చెందిన అటవీ హక్కు పత్రాలిచ్చారు. ఇంకా 90 వేల మంది దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. త్వరలో వీటిపై ప్రభుత్వం స్పష్టత తేనున్నది.

రాష్ట్రంలో 33 శాతం అటవీ భూములే…
రాష్ట్రంలోని భూభాగంలో 33 శాతం అటవీ భూమి ఉందని అంచనా. ఈ రికార్డులకు లెక్కలు లేకపోగా రెండు శాఖల మధ్య భిన్నమైన వివరాలు నమోదయ్యాయి. అటవీ భూములకు చెందిన 41.74 లక్షల ఎకరాల్లో వివాదాలు లేకుండా పక్కాగా ఉండగా, 25 లక్షల ఎకరాల భూమి సర్వే చేయాల్సి ఉంది. ఇవి రెవెన్యూ రికార్డుల్లో ఫారెస్టు, పోరంబోకు, జంగ్లత్‌, మహషురా తదితర పేర్లతో నమోదై ఉన్నాయి. ఆయా భూములకు చెందిన రికార్డుల్లో అటవీ భూమి అనే ఒకే పేరుతో రికార్డులను సరిదిద్దాలని సర్కార్‌ భావిస్తోంది. మరోవైపు రెవెన్యూ, అటవీ శాఖల మధ్య కూడా సరిహద్దు వివాదాలున్నాయి. కొన్ని అటవీ భూములకు రెవెన్యూ శాఖ అసైన్డ్‌ పట్టాలు జారీ చేసింది. ఈ రెండు శాఖల నడుమ 7లక్షల ఎకరాలకు చెందిన వివాదాలున్నాయని అంచనా. ఈ నేపథ్యంలో జాయింట్‌ సర్వేకు శ్రీకారం చుడుతున్నారు. రెండు శాఖలు సమన్వయంతో సర్వేచేసి హద్దులను నిర్ధారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement