Wednesday, March 27, 2024

కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఏర్పాటుపై పోలీసుల సీరియస్

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఏర్పాటు చేసుకున్న కార్ల యజమాన్యాలపై చర్యలకు ట్రాఫిక్ పోలీసులు ఉద్యుక్తులవుతున్నారు. చట్ట విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్స్ ఏర్పాటు చేసుకున్న వాహనదారులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచిస్తున్నారు. సుప్రీం కోర్టు అఫ్ ఇండియా వారి ఉత్తర్వుల ప్రకారం కారు యజమానులు, డ్రైవర్లు కారు అద్ధాలకు బ్లాక్ ఫిల్మ్ అంటించరాదని ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరుతున్నారు. కోర్టు తీర్పునకు విరుద్ధంగా మసులుకొనే వారిపై చట్టరీత్యా చర్యలు చేపడతామని వరంగల్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనాల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఏర్పాటు చేయడం వల్ల కారు లోపల జరిగే అవాంఛనీయ ఘటనలు గుర్తించలేకపోవడం, నష్టాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనాల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాటించకుండా, ఉల్లంఘించడం చట్టాన్ని వ్యతిరేకించడమే అవుతుందని గుర్తించి, వాహనాల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించుకొని సహకరించాలని వరంగల్ ట్రాఫిక్ ఇన్ స్పెక్ట‌ర్ వడ్డే నరేష్ కుమార్ కోరారు.

నగరంలో కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఏర్పాటు చేసుకున్న వాహనాలను నిలిపి స్వయంగా ఫిల్మ్స్ తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంఘటనలు జరిగిన తర్వాత స్పందించడం, హడహుడి, హంగామా చేయడం కాకుండా రెగ్యులర్ గా తనిఖీలు చేసి, చట్ట రీత్యా చర్యలు చేపడతామని వడ్డే నరేష్ కుమార్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ను కారు యజమానులు, డ్రైవర్లు ఖచ్చితంగా పాటించి, ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించాలని కోరారు. కార్లకు బ్లాక్ ఫిల్మ్ లను ఏర్పాటు చేసుకున్న వాహనాలపై ఇక నుండి ఫోకస్ పెడతామని గుర్తించి, రోడ్డెక్కిన తర్వాత జాప్యం జరుగుతోందని కానీ, ఏమర్జెన్సీ పనులు ఉన్నాయనే కట్టుకథలు చెప్పి తప్పించుకునే ట్రిక్స్ మాని, స్వచ్ఛందంగా ఎవ్వరికీ వారు తొలగించుకోవాలని వరంగల్ ట్రాఫిక్ ఇన్ స్పెక్ట‌ర్ వడ్డే నరేష్ కుమార్ సూచించారు. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించి, బ్లాక్ ఫిల్మ్ అంటించినచో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామ‌న్నారు. నగరంలో హెల్మెట్ ధరంచని వారిపై రెగ్యులర్ గా తనిఖీలు చేపట్టినప్పుడే, కార్ల బ్లాక్ ఫిల్మ్స్ లను చెకింగ్ చేస్తామని వరంగల్ ట్రాఫిక్ ఇన్ స్పెక్ట‌ర్ వడ్డే నరేష్ కుమార్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement