Monday, March 25, 2024

ఆరుగురు గంజాయి స్మగ్లర్లపై పీడీయాక్ట్

వరంగల్ క్రైమ్ : గంజాయి ఫ్రీ పోలీస్ కమిషనరేట్ గా మార్చేందుకు వరంగల్ పోలీస్ బాస్ డా.తరుణ్ జోషి వడివడిగా అడుగులు వేస్తున్నారు. గంజాయి అమ్మకాలను కట్టడి చేయడంతో పాటు, గంజాయి నిల్వలను అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్ల భరతం పట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడిన ఆరుగురు గంజాయి స్మగ్లర్లపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు.


వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న కొత్తగూడెంకు చెందిన బిత్ర నరేష్, తుమ్మల క్రాంతికుమార్, తుమ్మల నాగరాజు, గడిదేశి మనోజ్, మారంపూడి శ్రీను, గులోత్ సోమ్లాలపై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీచేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను నర్సంపేట రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ సూర్య ప్రసాద్ పీడీ యాక్ట్ ఉత్తర్వులను హైదరాబాద్ లోని చర్లపల్లి కారాగారంలో జైలర్ సమక్షంలో నిందితులకు అందజేశారు. పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందుకున్న నిందితులు గత సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ నుండి సుమారు 5 లక్షల విలువైన 56 కిలోల గంజాయిని రెండు ఆటోల్లో తరలిస్తుండగా ఖానాపూర్ మండల కేంద్రం శివారు ప్రాంతంలో వాహన తనీఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు నిందితులు చిక్కడంతో వారి నుండి పోలీసులు గంజాయితో పాటు గంజాయిని తరలిస్తున్న రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకోని నిందితులను జైలుకు తరలించారు. యువతను మత్తు బానిసలుగా మార్చి, వారి భవిష్యత్తుపై దుష్ప్రభావానికి గురిచేస్తున్న గంజాయి వంటి మత్తు మందు పదార్థాల అమ్మకాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యహరించబడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇలాంటి గంజాయి అమ్మకాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విధమైన చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తామని మరోమారు వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement