Wednesday, April 24, 2024

పండితాపురం సంత @ రెండు కోట్ల 39 లక్షల, యాభై వేలు

కామేపల్లి, మార్చి 17 (ప్రభ న్యూస్) : ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం గ్రామంలో శ్రీకృష్ణ ప్రసాద్ పశువుల సంత రాష్ట్రంలోనే పేరు గాంచింది. పేరుకు తగ్గట్టుగా వేలంపాట కూడా అంతే రీతిలో చోటుచేసుకుంది. శుక్రవారం పంచాయతీరాజ్ అధికారుల సమక్షంలో పశువుల సంత ప్రాంగణంలో పండితాపురం గ్రామంలో సంత వేలంపాట గ్రామ సర్పంచ్ మూడ్ దుర్గాజ్యోతి అధ్యక్షతన కొనసాగింది. తొలుత పాటదారులు ఒక్కొక్కరు రూ.35లక్షలు డిపాజిట్ చేశారు. మొత్తం ఏడుగురు వ్యక్తులు ధరావత్ నాగేశ్వరావు, భూక్య వీరన్న, భూక్య నాగేంద్రబాబు, బానోతు శంకర్, ధరావత్ ఉపేందర్, భూక్య రామకృష్ణ, సందీప్ నాయక్ లు పాటలో పాల్గొన్నారు. మద్దతు ధర రూ.2 కోట్ల 16 లక్షల 6వేలు(2,16,0,6000)మద్దతు ధరను పంచాయతీ అధికారులు ప్రకటించారు.

అనంతరం సంత వేలంపాట కొనసాగింది. ధరావత్ నాగేశ్వరరావు భూక్య వీరన్నల మధ్య ఉత్కంఠ భరితంగా పాట కొనసాగింది. పాటలో పదివేలు పెంచుకుంటూ పోటీదారులు పోటీపడ్డారు. చివరికి ధరావత్ నాగేశ్వరరావు రెండు కోట్ల 39 లక్షల 50 వేలకు(2,39,50,000) పాట పాడి సంత వేలంను కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా నిబంధనల ప్రకారం లోబడి పనిచేయాలని అధికారులు తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సింగరేణి సీఐ వెంకటేశ్వర్లు, కామేపల్లి, కారేపల్లి ఎస్సై లు కిరణ్ కుమార్, రామారావుల ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డీపీవో ఇంజం అప్పారావు, డీఎల్ పీవో పుల్లారావు, కామేపల్లి ఎంపీడీవో సిలార్ సహేబ్, ఎంపీవో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి నెహ్రు నాయక్, వివిధ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement