Thursday, March 28, 2024

వరి కొనుగోళ్లు ఆగలే.. ఆ స్టోరీస్​ అవాస్తవం: కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ :  తెలంగాణ రాష్ట్రం నుంచి వరి కొనుగోళ్ల వ్యవహారంపై కేంద్రం మరోసారి స్పందించింది. శుక్రవారం తెలంగాణ నేతల బృందం కేంద్ర మంత్రితో జరిపిన చర్చల అనంతరం వెలువడ్డ కథనాలు తప్పుదారిపట్టించేలా ఉన్నాయని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖలోని ఓ ఉన్నతాధికారి ఈ మేరకు మీడియాకు ఓ సోషల్ మీడియా సందేశం పంపించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రం వరి ధాన్యం సేకరణ ఎక్కడా నిలిపివేయలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కనీస మద్ధతు ధర చెల్లిస్తూ కొనుగోళ్లు జరుగుతున్నాయని వెల్లడించారు.తెలంగాణ మంత్రులు, ఎంపీలు, అధికారులతో కూడిన బృందం జరిగిన భేటీ అనంతరం తెలంగాణ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యాసంగి (రబీ)లో వరి సాగు చేయవద్దని కేంద్రం చెప్పిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అయితే తాము వరి సాగు వద్దని చెప్పలేదని, కాకపోతే పంటమార్పిడి చేసి వరికి బదులుగా మరేదైనా సాగుచేయాల్సిందిగా సూచన మాత్రమే చేశారని శుక్రవారం రాత్రే ఓ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం ఎప్పుడూ రాష్ట్రాలకు సూచనలు మాత్రమే చేస్తుందని, బలవంతం చేయడం సాధ్యంకాదని ఆయన వ్యాఖ్యానించారు.
 
అయితే శనివారం మీడియాలో వచ్చిన కథనాలను గమనించిన కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ అవి ప్రజలను తప్పుదారిపట్టించేలా ఉన్నాయని భావించింది. పూర్తిగా రాష్ట్రంలో కేంద్రం ధాన్యం సేకరణ నిలిపివేసిందని పేర్కొంటూ వచ్చిన కథనాలను ఖండిస్తూ మంత్రిత్వశాఖకు చెందిన మీడియా సంబంధింత వ్యవహారాలు చూసుకునే అధికారిణి నిహి శర్మ ఈ మేరకు ఓ నోట్ విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement