Tuesday, March 28, 2023

ఆప‌రేష‌న్ క‌రీంన‌గ‌ర్…

వామన్‌రావు కేసులో పుట్టమధు దంపతుల విచారణ
నేతలకు, అధికారులకు షాకులు
గులాబీనేతల్లో దడ.. అధికారుల్లోనూ గడబిడ
హుజూరాబాద్‌, మంథనిలో బదిలీల పర్వం
రూ.2కోట్ల సుపారీ ఆరోపణలపై విచారిస్తున్న పోలీసులు
బ్యాంకు లావాదేవీలపై ఆరా
మరో మార్కెట్ కమిటీ ఛైర్మన్‌కు నోటీసులు.. పరారీలో పలువురు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కరీంనగర్‌.. ఇపుడు రాష్ట్ర రాజకీయాలు కేరాఫ్‌ కరీంనగర్‌గా మారాయి. తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్‌ నేతగా ఉన్న ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌ వ్యవహారం నుండి ఇపుడు మంథని జడ్పీ ఛైర్మన్‌ పుట్టమధు విచారణ దాకా అనేక సం చలనాలు చోటుచేసుకుంటున్నాయి. కేసులు, విచారణలు, బర్తరఫ్‌లు, చర్యలు.. కరీంనగర్‌ రాజకీయం కాకమీదుంది. ఏ రోజు ఏం జరుగుతుందో అర్ధం కాక అటు గులాబీపార్టీ నేతల్లో.. ఇటు అధికారవర్గాల్లో గుబులు నెలకొంది. ఆదివారం మంధని నియోజకవర్గానికి చెందిన అనేకమంది అధికారులను బదిలీచేయడంతో పాటు జడ్పీఛైర్మన్‌ సతీమణి మునిసిపల్‌ ఛైర్‌ పర్సన్‌ పుట్టశైలజకు నోటీసిచ్చి విచారించడం, మరో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌కు నోటీసు జారీచేయడం గులాబీపార్టీలో సంచలనంగా మారింది. ఇప్పటికే హుజూరాబాద్‌కు చెందిన పోలీసు, రెవెన్యూతో పాటు వివిధశాఖలకు చెందిన మండల స్థాయి అధికారులను బదిలీచేసిన ప్రభుత్వం ఇటు ఈటల రాజేందర్‌, అటు పుట్టమధు సిఫార్సులపై ఎవరు పోస్టింగ్‌లు తెచ్చుకున్నారో వెతికిమరీ బదిలీచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆపరేషన్‌ మంథని కార్యక్రమం సీరియస్‌గా సాగుతుండగా.. తాజా పరిణామాలు, ప్రక్షాళన ఈ రెండు నియోజకవర్గాలకే పరిమితం కాదని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా మరిన్ని సంచలనాలు, మార్పులు ఉండబోతున్నా యని అధికారపార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గుట్టుగా విచారణ
పెద్దపల్లి జడ్పీఛైర్మన్‌ పుట్టమధు విచారణ సందర్భంగా.. తనకు వామన్‌రావు కేసుకు ఏ సంబంధం లేదని తేల్చిచెబు తున్నట్లు సమా చారం. పోలీసులు రెండురోజుల పాటు ప్రశ్నించినా.. ఒకే సమాధానం చెప్పినట్లు తెలిసింది. అయితే తాను ఎందుకు అజ్ఞాత ంలోకి వెళ్ళింది.. ఎలా వెళ్ళింది వివరించి నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపు వామన్‌రావు తండ్రిని ఆదివారం పోలీసులు పిలిపించి.. అనుమానాలు, ఆధారాలు సేకరించారు. వామన్‌రావు దంపతుల హత్యకు రెండు, మూడురోజులకు ముందు వరంగల్‌కు చెందిన ఓ టీఆర్‌ఎస్‌ నేత చిట్‌ ఫండ్‌ ద్వారా రూ.2కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిజనిర్దారణ, లావాదేవీలకు సంబంధించి 12 బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రూ.5లక్షల పైచిలుకు జరిగిన ప్రతి లావాదేవీని పోలీసులు పరిశీలన జరుపుతున్నారు. రూ.2కోట్లు ఎవరు..ఎవరికి ఎలా ఇచ్చారు? అన్న అంశంపై విచారణ జరుగుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఇదే కేసులో పుట్టమధు భార్య మంథని మునిసిపల్‌ ఛైర్మన్‌ పుట్టశైలకు 41సీఆర్‌పిసి కింద నోటీసుజారీచేసి విచారణ జరుపుతున్నారు. జడ్పీఛైర్మన్‌ మధు, ఆయన భార్య, కమాన్‌పూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌కు పోలీసులు నోటీసులు జారీచేయడంతో.. వీరికి సన్నిహితంగా ఉండే నేతలు, మంథని నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్యులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తాజా రాజకీయాలు, విచారణల నేపథ్యంలో.. నేతలు హడలుతు న్నారు. విచారణ పారదర్శకంగా జరిగేందుకు.. మధు సిఫార్సుద్వారా పోస్టింగ్‌ తెచ్చుకున్న అధికారులను, మధుకు సన్నిహితంగా ఉండే పలువురు సీఐలు, ఎస్‌ఐలను బదిలీచేశారు. మంథని సీఐ మహేందర్‌ రెడ్డిని వరంగల్‌ కమిషనరేట్‌కు ఎటాచ్‌ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే.. ఈ విచారణ, బదిలీలు.. ఆపరేషన్‌ కరీంనగర్‌ సాగుతోంది. ఇక పుట్టమధు అజ్ఞాతంలో ఉన్నపుడు సహకరిం చిన వారిపైనా పోలీసులు ఆరాతీస్తున్నట్లు తెలిసింది. అటు హుజూరాబాద్‌, ఇటు మంథనిపై విచారణలు కొనసాగుతుం డగానే మరికొందరు నేతలపైనా ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో మధుకు ఏ తరహా సంబం ధాలున్నాయి.. రాజకీయ సంబంధాలు న్నాయా? కొత్త ప్రణాళికలేమైనా ఉన్నా యా? ఆర్ధిక భాగస్వామ్యాలు న్నాయా అన్న అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమా చారం. అదే జిల్లాకు చెందిన మరోమంత్రిపై తాజాగా ఆరోపణలు రాగా, మరికొందరు నేతలపైనా వివాదాలు వెలుగుచూస్తున్నాయి.
ఇతర జిల్లాలపై కూడా..
ప్రస్తుతం సాగుతున్న ఆపరేషన్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకే పరిమితం అవుతుందా.. ఆరోపణలున్న ఇతర నేతలపై కూడా మళ్ళుతుందా అన్నది చర్చనీయాంశంగా మారుతుంది. గత కొద్దిరోజులుగా భూ వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మంత్రికి సంబంధించిన ఆడియో టేపు ఇటీవల కలకలం సృష్టించింది. తాజాగా దేవరయంజాల్‌ భూముల వ్యవ హారం, ఆ మంత్రి నేరుగా ఓ ఛానల్‌ లైవ్‌లోకి వెళ్లి ప్రత్యర్ధిపార్టీ నేతతో మాట్లాడడం, ఇతర వివాదాల్లోకి దిగడం, కొత్త పంచా యతీలు నెత్తికెత్తుకోవడంతో సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం కరోనా కట్టడి అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీరియస్‌గా దృష్టిపెట్టగా, మరోవైపు రాజకీయ వేడి కొనసాగుతోంది. హుజూరాబాద్‌లో మొదలైన ఆపరేషన్‌.. మంథనితో ముగుస్తుందా? మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement