Sunday, December 3, 2023

TS | ఇంకా 14 రోజులే.. పోలింగ్‌ కేంద్రాలనుంచి ఏర్పాట్ల వరకు అంతా రెడీ !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుగుతున్న మూడో ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను సెఉమీ ఫైనల్‌గా భావిస్తున్న ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఢిల్లి నుంచి గల్లి వరకు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఎన్నికల సమరానికి మరో 14 రోజులే ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న జరిగే ఎన్నికలకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది.

తెలంగాణ శాసనసభ కాలపరిమితి 2019 జనవరి 15న ప్రారంభమై 2024 జనవరి 16తో గడువు ముగియనున్నది. రాష్ట్ర శాసనసభా ఎన్నికలకు అక్టోబర్‌ 9న షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. నవంబర్‌ 3న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి వారంపాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగించారు. ఈ నెల 10న నామినేషన్ల గడువు ముగిసి 13 వరకు పరిశీలను చేపట్టారు. 15తో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి చేసి పోటీలో ఉన్న అభ్యర్ధుల జాబితా ఫైనల్‌ చేశారు. ఎన్నికల ప్రచారం ఈ నెల 28 సాయంత్రంతో ముగియనుంది. నవంబర్‌ 30న పోలింగ్‌ డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ అదేరోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

- Advertisement -
   

పక్కా ఏర్పాట్లు…

రాష్ట్రవ్యాప్తంగా 35356 పోలింగ్‌ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేస్తోంది. ఇందులో 27798 పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ క్యాస్టింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 597 విమెన్‌ పోలింగ్‌ కేంద్రాలు, 640 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు,120 దివ్యాంగుల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలకు 67 మంది సాధారణ అబ్జర్వర్లు, 39మంది పోలీస్‌ అబ్జర్వర్లను నియమించారు. నవంబర్‌ 30న ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 13 సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్‌ను ముగించనున్నారు.

తుది ఓటర్ల జాబితా ప్రకటన…

ఈసీ తుది ఓటర్ల జాబితాలో తెలంగాణలో 3.26కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1.63కోట్లుకాగా, పురుష ఓటర్లు 1.62కోట్లుగా ఉన్నారు. తొలిసారి ఓటు హక్కు పొందిన 18-19ఏళ్ల ఓటర్లు 9,99,667 మంది, ఇందులో పురుషులు 5,70,274మంది, మహిళా ఓటర్లు 4,29,273 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 59ఏళ్లలోపు వాళ్లు 45,36,852 మందికాగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో 2,26,574మంది ఉన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7,32,560మంది ఓటర్లుతో తొలిస్థానంలో నిల్వగా, అతి తక్కువగా భద్రాచలం నియోజకవర్గంలో 1,48,713 మంది ఓటర్లున్నారు.

ఈ ఎన్నికల్లో 4798 మంది నామినేషన్లు సమర్పించగా, పరిశీలన తర్వాత 2898 మంది నామినేషన్లకు ఆమోదం దక్కింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 2290 మంది అభ్యర్ధులు తుది పోరు బరిలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీనగర్‌లో 48మంది, గజ్వేల్‌లో 44మంది, కామారెడ్డిలో 39మంది పోటీలో నిలిచారు. అత్యల్పంగా నారాయణపేటలో ఏడుగురు, బాన్సువాడలో ఏడుగురు చొప్పున బరిలో ఉన్నారు.

దీంతో ఎన్నికల పోటీలో ఉన్న తుది పోటీదారుల జాబితా ఈసీ ప్రకటించింది. నియోజవకర్గాల వారీగా అభ్యర్ధుల గుర్తుల కేటాయింపు పూర్తయింది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత స్వతంత్ర అభ్యర్ధులకు ఈసీ గుర్తుల కేటాయింపు ప్రక్రియ చేపట్టింది. ఈ సందర్భంగా పలు అభ్యంతరాలు తెరపైకి వస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఈ సందర్భంగా ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. తమ పార్టీ గుర్తులను పోలిన గుర్తులు ఇండిపెండెంట్లకు దక్కడంతో తమకు పడే ఓట్లు వారికి పడుతాయనే భయం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుత యుగ తులసీ ఫౌండేషన్‌ గుర్తయిన రోడ్డు రోలర్‌పై బీఆర్‌ఎస్‌ ఆదుర్ధా చెందుతోంది. అలయన్స్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌ పార్టీకి చెందిన చపాతీ కర్ర గుర్తుపై కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యంతరం చెబుతోంది. దీనిపై బీఆర్‌ఎస్‌ సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. గుర్తింపులేని పార్టీలకు ఈసీ ముందుగానే కొన్ని గుర్తులను రెడీ చేసి పెట్టుకోవడం ఆనవాయితీ. ఇందులోనుంచి అందరూ సులభంగా గుర్తించే గుర్తులను ఆయా పార్టీలు, అభ్యర్ధులు కోరుతారు. 1990కి ముందు ఈసీ జంతువుల గుర్తులను కేటాయించేది.

ఎన్నికల సమయంలో జపార్టీలు ఆయా గుర్తుల జంతువులను ఊరేగిస్తూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో హింస పేరుతో జంతు ప్రేమికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ ఈ గుర్తులనుఎ నలిపివేసింది. కానీ బీఎస్పీకి ఏనుగు, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పా పార్టికి సింహం గుర్తులు ఇంకా కొనగ సాగుతున్నాయి. రిజర్వేషన్‌ అండ్‌ లాండ్‌మెంట్‌ ఆర్డర్‌ 1968కింద సీఈసీ పార్టీలకు గుర్తులను రిజర్వ్‌ చేసింది. దేశంలో 6 జాతీయ, 26 ప్రాంతీయ మరో 2507 గుర్తింపులేని పార్టీలున్నాయి. అయితే గుర్తింపు పొందిన ఆపార్టీల సింబల్స్‌ ఎప్పుడూ స్థిరంగా కొనసాగుతాయి. ప్రస్తుతం ఈసీ దగ్గర 193 గుర్తులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement