Thursday, March 28, 2024

ఇవి పేద వాడి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీకః కేటీఆర్

అభివృద్ధి విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం వెన‌క్కిపోదు అని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. పాత‌, కొత్త న‌గ‌రం అనే తేడా లేకుండా హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని పిల్లిగుడిసెలు బ‌స్తీలో నూత‌నంగా నిర్మించిన 288 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పిల్లిగుడిసెల బ‌స్తీలో ఒక‌ప్పుడు మంచినీళ్ల గోస ఉండేదని, డ్రైనేజీ స‌రిగా లేక ఇబ్బందులు ప‌డేవారన్నారు. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవని చెప్పారు. స్థానిక ప్రాంతంలో అభివృద్ధి జ‌ర‌గాల‌నే ఉద్దేశంతో ఎమ్మెల్యే బ‌లాల ఎన్నోసార్లు సీఎం కేసీఆర్‌ను క‌లిసి విన్న‌వించారని మంత్రి కేటీఆర్ అన్నారు.  డ‌బుల్ బెడ్రూం ఇండ్లు, ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, డ్రైనేజీ, మంచినీటి సౌక‌ర్యం వంటి సమస్యలను ప‌రిష్క‌రించుకుంటూ ముందుకు వెళ్తున్నామ‌ని తెలిపారు. జంగంమెట్‌, బండ్ల‌గూడ‌, ఫారూఖ్‌న‌గ‌ర్‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగ‌వంతం చేసి పేద ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తామ‌న్నారు.

ప్రస్తుతం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల స్థలంలో ఒక వేళ ప్ర‌యివేటు బిల్డ‌ర్ ఇల్లు క‌ట్టి ఉంటే.. ఒక్కో ఇల్లు రూ. 50 నుంచి రూ. 60 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌రీదు చేసి ఉండేవని చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ నిరుపేద ప్ర‌జ‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశంతో ఉచితంగా ఇండ్లు క‌ట్టించి ఇస్తున్నారు. నాణ్య‌త విష‌యంలో రాజీ ప‌డ‌కుండా.. ప‌నులు చేస్తున్నామన్నారు. ఇది ఇల్లు కాదు.. పేద వాడి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక అని మంత్రి కేటీఆర్ తెలిపారు.  

చంచ‌ల్‌గూడ జైలును ఇక్క‌డి నుంచి త‌ర‌లించాల‌ని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఓవైసీ విజ్ఞ‌ప్తి చేశారు అని కేటీఆర్ తెలిపారు. 34 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న చంచ‌ల్‌గూడ జైలును త‌ర‌లించి.. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఇండ్లు కానీ, ఐటీ పార్కు కానీ, విద్యాసంస్థ‌లు కానీ ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నారన్న కేటీఆర్… ఈ విష‌యాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామ‌ని చెప్పారు. అలాగే ఉస్మానియా ఆస్ప‌త్రికి కొత్త బిల్డింగ్ క‌ట్టాల‌ని ఎంపీ విజ్ఞ‌ప్తిని కూడా పరిశీలిస్తామన్నారు. ఉస్మానియా ఆస్ప‌త్రి శిథిలావ‌స్థ‌లో ఉన్న విష‌యాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. హైదరాబాద్ లో నాలుగు టిమ్స్ ను నిర్మించ‌బోతున్నారని కేటీఆర్ వెల్లడించారు. స‌న‌త్ న‌గ‌ర్‌, అల్వాల్, గ‌డ్డి అన్నారంలో మ‌రో మూడు టిమ్స్ ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండిః రేవంత్‌రెడ్డికి షాక్.. సమన్లు జారీ చేసిన నాంపల్లి కోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement