Tuesday, March 26, 2024

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ప్రశంసనీయం

నిజామాబాద్ సిటీ : సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని వక్తలు కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ మరింత అభివృద్ధిని సాధించా లని వారు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని స్థానిక న్యూ అంబేద్కర్ భవన్ లో అట్టహాసంగా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ నీతూకిరణ్, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, మహిళా సహకార కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత హాజరు జ్యోతి ప్రజ్వలన చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమా నికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుకుం టున్నారని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఆడ శిశువు జన్మిస్తే 13 వేల రూపాయలను అందిస్తోందని, గర్భం దాల్చిన నాటి నుండే వారికి పౌష్టికారం సమకూరుస్తోందని అన్నారు.

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ఎంతో చక్కగా రాణిస్తూ, సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. ఉద్యోగాల నిర్వహణ, క్రీడా రంగంలోనే కాకుండా రక్షణ రంగంలో సైతం సత్తా చాటుకుంటున్నారని కొనియాడారు. మహిళల పట్ల సమాజ దృక్పథంలో చాలా వరకు మార్పు వచ్చిందని, అయితే ఈ మార్పు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా విస్తరించబడాలని, అప్పుడే అన్ని ప్రాంతాల్లోనూ మహిళలకు తగిన గౌరవం, సమానత్వం దక్కుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా మహిళలను చైతన్యపర్చేందుకు కృషి చేయాలని ఐ సీ డీ ఎస్ సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలన్నారు. ప్రతి కుటుంబంలోనూ మహిళల ప్రభావం ఒకింత ఎక్కువగా ఉంటుందని, తమ పిల్లల పట్ల ఆడ, మగ అనే బేధం చూపకుండా బాలికలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని హితవు పలికారు. కాస్తంత ప్రోత్సాహం అందిస్తే ఏ రంగంలోనైనా మహిళలు రాణిస్తారని, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. పోటీ తత్వంతో కూడిన నేటి సామాజిక పరిస్థితులలో మహిళలు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఏ విషయంలోనూ తాము ఎవరికీ తక్కువ కాదన్న నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మహిళలు కలిగి ఉండాలని, అలాంటప్పుడు సమాజం నుండి కూడా ఆశించిన గౌరవ మర్యాదలు తప్పనిసరి దక్కుతాయని సూచించారు. అభివృద్ధి చెందిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రపంచంలో జరిగే అన్ని విషయాలను క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు ఏర్పడిందని, ఈ సాంకేతికను వినియోగించుకుంటూ మహిళలు మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.

మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అమలులోకి తెచ్చిన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల అనారోగ్యాలతో ముడిపడి ఉన్న అనేక రకాల సమస్యలకు ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా వైద్య సేవలు అందించబడతాయని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం 2018-19, 2019-2020 సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ లేని రుణాల కింద జిల్లాకు రూ.88 కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. వీటిని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ.. రాజకీ యాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మహిళలకు స్థానిక సంస్థల్లో శాసనం ద్వారా యాభై శాతం రిజర్వేషన్ అమలు చేస్తోందని, ఫలితంగా జిల్లాలోని నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ తో పాటు, మిగతా మూడు మున్సిపాలిటీల్లోనూ అతివలు చైర్ పర్సన్లుగా చక్కగా రాణిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలందిస్తున్న మహిళలు, మహిళా ఉద్యోగులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు సూదం లక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధారాణి, నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, నీరజారెడ్డి, గుజ్జ రాజేశ్వరి , సీడీపీఓ ఇందిర, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement