Sunday, October 13, 2024

NZB: పొట్టి శ్రీరాములు పేరు మార్చాలనే నిర్ణయాన్ని పున పరిశీలించాలి.. ధన్ పాల్

నిజామాబాద్ ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రభ న్యూస్) : హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పేరు మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునః పరిశీలించాలని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ కోరారు. ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలనీ తెలిపారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కింద మంత్రిమండలి సమావేశంలో తీర్మానించిన అంశాల్లో మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ ల పేర్లు పెట్టడంపై స్వాగతిస్తున్నామన్నారు. కానీ తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చే పొట్టిశ్రీరాములు పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.

పొట్టి శ్రీరాములు పేరును మార్చడం సమంజసం కాదన్నారు. పొట్టి శ్రీరా ములు ఏ ప్రాంతానికో… రాష్ట్రానికో చెందిన వారు కాదని గుర్తించాలన్నారు. ఆయన దేశం గర్వించదగ్గ నాయకుడన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని గాంధీజీ ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. అలాంటి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం తెలుగు విశ్వ విద్యాలయానికి ఆ పేరు పెట్టారని, కానీ ఇప్పుడు మార్చడం సరికాదన్నారు. తెలుగు విశ్వవిద్యా లయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టి గౌరవించు కోవడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఆయనను గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం సరికాదన్నారు. దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు దళితులను గుడులలోకి ప్రవేశింపచేయాలనీ నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆస్తిత్వానికి ప్రతీకలైన జిల్లాల పేర్ల మార్పుపై ప్రస్తావించా..
తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆస్తిత్వానికి ప్రతీకలైన జిల్లాల పేర్ల మార్పుపై తాను అసెంబ్లీలో ప్రస్థావించినట్లుగా అర్బన్ ఎమ్మెల్యే చెప్పారు.హైదరాబాద్ ను భాగ్యనగర్ గా నిజామాబాద్ ను ఇందూర్ గా, ఆదిలాబాద్ ను ఎదులాపురంగా, మహబూబ్ నగర్ ను పాలమూరుగా , మహబూబాబాద్ ను మానుకోటగా వరంగల్ ను ఓరుగల్లుగా జిల్లాల పేర్ల మార్పుపై కూడా వెంటనే మంత్రిమండలి సమావేశమై ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement