Thursday, April 25, 2024

మాస్ట‌ర్ ప్లాన్ రద్దు కోరుతూ కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ అత్య‌వ‌స‌ర స‌మావేశం..

కామారెడ్డి – మాస్టర్ ప్లాన్ మాకొద్దంటూ నెలన్నర రోజులుగా రైతు ఐక్య కార్యాచరణ కమిటి చేస్తున్న పోరాటం ఫలించింది. మాస్టర్ ప్లాన్ రద్దు చేసేందుకు కామారెడ్డి మున్సిపల్ పాలక వర్గం సిద్ధమైంది. కాసేపట్లో కామారెడ్డి మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశం ద్వారా ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్టు మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి ప్రకటించారు. దీంతో కొన్నాళ్లుగా జరుగుతున్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు స్థానిక రైతులు.

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అనేక రూపాల్లో నిరసన చేపట్టింది. ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, బంద్‌లతో పాటు మున్సిపల్ ఆఫీస్ ముట్టడి, కౌన్సిలర్ల ఇళ్ల ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపట్టింది. విలీన గ్రామాల కౌన్సిలర్లు తొమ్మిది మంది రాజీనామా చేయాలన్న డెడ్ లైన్ విధించింది.
రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఒత్తిడి మేరకు బీజేపికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తమ రాజీనామా లేఖలను మున్సిపల్ కమిషనర్ కు పంపారు. అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు కూడా షబ్బీర్ అలీకి రాజీనామా లేఖలు పంపారు. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన 8మంది రాజీనామాకూ షబ్బీర్అలీ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అధికార పార్టీ కౌన్సిలర్లపైనా ఒత్తిడి పెరిగింది. రైతు జేఏసీ స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించాలని కూడా పిలుపునిచ్చింది. ఈ విషయంపై చర్చించిన అధికార పార్టీ నేతలు ఇవాళ మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలనీ ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానం చేయాలని నిర్ణయించారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement