Tuesday, November 28, 2023

బీసీ ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు ముహూర్తం ఖరారు : మంత్రి గంగుల

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సర్వం సిద్ధ‌మైంద‌ని, ఇప్పటికే పలుధపాలుగా బీసీ సంఘాలతో సమావేశమై 32 బీసీ కులాలను ఏకతాటిపైకి తెచ్చిన ప్రభుత్వం, కోకాపేట్, ఉప్పల్ భగాయత్లో కేటాయించిన వేల కోట్ల విలువైన 87.3 ఎకరాల్లో అన్ని పనులు పూర్తి చేసుకొని నిర్మాణాలు ప్రారంభించడానికి ముహుర్తం ఖరారు చేసింద‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పిభ్రవరి 5న కోకాపేట్లో, 6న ఉప్పల్ భగాయత్, పిర్జాదిగూడల్లో అయా సంఘాలతో సామూహికంగా భూమిపూజలు నిర్వహిస్తామన్నారు. బుధ‌వారం హైదరాబాద్ దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో 32బీసీ కుల సంఘాల ప్రతినిధులతో పాటు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్షిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశం, సంబందిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి గంగుల సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడుతూ.. 75 ఏళ్ల స్వతంత్ర్య భారత చరిత్రలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి చేయని విదంగా 41 బీసీ కులాల ఆత్మగౌరవం కోసం కేసీఆర్ అత్యంత విలువైన జాగలను హైదరాబాద్లో కేటాయించి వాటికి నిధులతో పాటు ఆయా కులాల ఆత్మగౌరవం ప్రతిభింబించేలా నిర్మించుకునే సువర్ణ అవకాశం సైతం ఆయా బీసీ కులసంఘాలకే కల్పించారన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్డర్లు పొందిన ప్రతీ ఏక సంఘం మార్చి 31లోగా స్లాబులు పూర్తయ్యేలా నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. ఇప్పటికే అనుమతి పత్రాలు పొందిన ఏ బీసీ కులమైన ఈ గడువులోగా ముందుకు రాకపోతే ప్రభుత్వమే నిర్మాణాలను చేపడుతుందన్నారు. మిగతా సంఘాలు సైతం అతిత్వరలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు మంత్రి గంగుల కమలాకర్. ఎట్టిపరిస్థితుల్లోనూ అన్ని బీసీ ఆత్మగౌరవ భవనాలు దసరాకు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆత్మగౌరవ భవనాల్లో కళ్యాణవేదికలు, సమావేశ మందిరాలు, విద్యార్థులకు హాస్టల్లు, రిక్రియేషన్ తదితర అన్ని సధుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

- Advertisement -
   

కోకాపేట, ఉప్పల్ భగాయత్ తదితర బీసీ ఆత్మగౌరవ భవనాల ప్రాంగణాల్లో రోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌళిక వసతులను సైతం ఈనెలాఖరులోగా పూర్తి చేస్తామని ఇందుకోసం బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో పాటు, హెచ్ఎండీఏ, విద్యుత్, వాటర్ వర్క్స్, ఆర్ అండ్ బీ తదితర అన్ని శాఖల అధికారులను సమన్వయపరిచి నిర్ణిత కాలంలో పనులు పూర్తయ్యేలా అడ్ హాక్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా ఏక సంఘంగా ఏర్పడిన బీసీ కుల సంఘాలు నిర్మించుకునే భవనాలకు సైతం శాఖపరంగా అన్ని పనులు చూసుకునేందుకు లైజనింగ్ ఆఫీసర్లను సైతం నియమించామని వీరందరినీ సమన్వయపరిచే వేదికను సైతం ఏర్పాటు చేసామన్నారు మంత్రి గంగుల, నిర్మాణం కోసం ఎలాంటి ఇబ్బందులున్నా సంబందిత కులసంఘాలు నేరుగా తనను సంప్రదించవచ్చని సూచించారు మంత్రి గంగుల కమలాకర్. ఎట్టిపరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కలలు కన్న విదంగా బీసీల ఆత్మగౌరవం ఇనుమడించేలా బీసీ ఆత్మగౌరవ భవనాలను దసరా నాటికి ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీ బండాప్రకాశ్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్షిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశం, రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఎస్.తిరుపతి రావ్, మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ నర్సింహారెడ్డి, టీఎస్ ఈడ‌బ్ల్యూఐడీసీ సీఈ అనిల్, రంగారెడ్డి ఈఈ కుమార్ గౌడ్, హెచ్ఏండీఏ డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్ ముంతాజ్, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మల్లయ్య బట్టు, చంధ్రశేఖర్, సంద్య, విమల, ఉదయ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement